టీచర్ల పిల్లలను సర్కారు స్కూళ్లకే పంపాలా?

తెలంగాణ వేతన సవరణ సంఘం మరో అసంబద్ధ సూచన

Government School -File
Government School -File

ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసిన తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం మరో అసంబద్ద సూచన చేసింది. టీచర్లు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలకు పంపితేనే వారి పిల్లలకిచ్చే ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ఉంటుందని, ప్రైవేట్‌కు పంపితే ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం టీచర్ల పిల్లలకు ఇద్దరికి ఇంటర్‌ వరకు సంవత్సరానికి రెండువేల రూపాయల ట్యూషన్‌ ఫీజు ప్రభుత్వం ఇస్తుంది. టీచర్లు తమ పిల్లలను తాము చదువు చెప్పే సర్కారీ బడులకు ఎందుకు పంపరు అనేది ఎప్పటి నుండో ఉన్న చర్చే. తాజాగా పిఆర్‌సీ రిపోర్టులో ఎందుకు చేర్చారనేదే సందేహం. అతి తక్కువ జీతాల పెంపుపై టీచర్లు ఉద్యమించకుండా, వారిని దృష్టి మళ్లించే ఎత్తుగడగా, వారిలో నైతికతను ప్రశ్నించేలా ఇది చేర్చారా అనేది సందేహం. రిపోర్టులో ఇది చేర్చిన వారు తమను తాము ఒక ప్రశ్న వేసుకోవాలి.

తమ పిల్లలను ఐఎఎస్‌లు ఎక్కడ చదివిస్తున్నా రు?అటెండర్‌ నుండి ప్రధాన కార్యదర్శి వరకు, వార్డుమెంబర్‌ నుండి ముఖ్యమంత్రుల వరకు తమ పిల్లలను ఏ పాఠశాలల్లో చదివిస్తున్నారో ఆలోచించాలి. నేడు అత్యంత నిరుపేదలు, అనా ధలు, ప్రైవేట్‌ ఫీజుల భారం భరించలేని ఎస్సీ,ఎస్టీ, బిసి వర్గాలు ఉన్నత కులాల్లో పేదలు, సర్కారు బడులపై ఇంకా కొద్దోగొప్పో నమ్మకం గలవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్న ఆదాయ అసమానతల ప్రకారం పాఠశాలలు ఏర్పడ్డాయి. ఉన్నవారికి ప్రైవేట్‌ పాఠశాలలు, లేని వారికి గవర్న మెంట్‌ పాఠశాలలు. ఒకప్పుడు టీచర్లు సహా అన్ని ఆదాయవర్గాల పిల్లలు కలిసి చదివిన సర్కారు బడికి ఉన్నత వర్గాలు, టీచర్ల పిల్లలు ఎందుకు దూరమయ్యారో ప్రతి ఒక్కరు ఆలోచించాలి.

1986 జాతీయ విద్యావిధానం తర్వాత ప్రైవేట్‌ విద్యకుఅవకాశం కల్పించిన ప్రభుత్వాలు క్రమేణా ఈ రంగం నుండి తప్పుకుంటు న్నాయి. డిపెప్‌, ఎపెప్‌, ఎస్‌ఎస్‌ఎల పేరుతో ఓవర్సీస్‌ డెవలప్‌ మెంట్‌ నిధులతో, బడులను స్థాపించి, ఉపాధ్యాయులనైతే నియ మించారు కానీ, వాటిలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థలను గాలికొది లేశారు. ఒకవైపు ప్రైవేట్‌ రంగం కార్పొరేట్‌ హంగులు, ఐఐటి, ఎన్‌ఇఇటి, టాలెంట్‌ సెర్చ్‌లు,ఒలంపియాడ్‌లు,ఫౌండేషన్‌ కోర్సులు అంటూ పోటీతత్వాన్ని పెంచుతూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో నల్లబల్లల కొరత, చెట్ల కింద చదువ్ఞలు, తేళ్లు సంచరించే పరిసరాల్లో, పాచిపట్టిన నల్లాల మంచినీరు, శౌచాల యాల కొరత ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణమైంది.

ప్రైవేట్‌ వారు నిత్యం మౌలిక సదుపాయాలు అభివృద్ధిచేసుకుంటూ గడప గడపకు బస్సులు పంపి ఇంటి నుండి పిల్లలను సేకరిస్తున్నారు. నేడు ప్రతి తండాకు,గూడేలకు కూడా మిని బస్సులు వెలుతున్నా యి. కాని వెయ్యి మంది చదివే పెద్ద హైస్కూల్‌ విద్యార్థులకు కూడా బస్సు ఇంటివరకు వచ్చే అవకాశం లేదు. ఉచిత పాసులతో కిక్కిరిసిన పల్లెవెలుగులో ఫుట్‌బోర్డులపై కూడా వారు ప్రయాణిం చాల్సి వస్తుంది. స్టేజీపై డ్రైవర్‌ బస్సు ఆపితేనే ఆరోజు బడి. లేటయితే బళ్లో దండనకు గురి కావలసి వస్తుంది. ప్రైవేట్‌ వారు టీచర్ల ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేసుకుని సబ్జెక్టు కొరత రాకుండా చూస్తారు. గవర్నమెంట్‌ పాఠశాలలో మధ్యలో సబ్జెక్టు టీచర్‌ రిటైర్డ్‌ అయితే మళ్లీ బదిలీలు,పదోన్నతుల వరకు ఆ సబ్జెక్టు ఖాళీగానే ఉంటుంది.

డిప్యూటేషన్‌పై మరో మాస్టారు రావడానికి సమయం పట్టడం, వచ్చినా వాలంటీరో, రెగ్యులర్‌ డిప్యూటేడ్‌ టీచర్‌ విషయంపై నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పలేం. టీచర్లు మధ్యలో వస్తూపోతూ ఉండటం వల్ల పిల్లలకు కాన్సెప్ట్‌లు, మిస్‌ కావడం, కొన్ని చాప్టర్లు వేగంగా పూర్తికావడం వల్ల నష్టం జరుగు తుంది.డిఎస్సీల ద్వారా అత్యంత నాణ్యమైన టీచర్లునేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. కాని గత రెండు,మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యలో అంతరం పెరిగి సమాజ దృష్టంతా ప్రైవేట్‌ ఆకర్షణవైపు మళ్లింది. దీనికి టీచర్లు అతీతం కాదు. విద్య నేడు హోదా చిహ్నంగా మారింది.

సర్కారు బడిలో చేర్పిస్తే చిన్నచూపు చూసే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితిలో టీచర్‌ను వేలెత్తి చూపడం సరైనది కాదు. వ్యాధికి మూలకారణం ప్రభు త్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత. ప్రైవేట్‌ వైద్య వ్యాపారం ఎందుకు విస్త రించిందో గుర్తించి నివారించాలి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో అభివృద్ధి చేసినట్లుగా సర్కారు బడిలో సకల సదుపాయాలు సమకూర్చాలి. ఖాళీగా ఉన్న టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఇఒ, డిఇఒ పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన తక్షణమే భర్తీచేయాలి. నెలవారి పదోన్నతులు ప్రవేశపెట్టి ఖాళీలు లేకుండా చూడాలి. పటిష్ట తనిఖీ వ్యవస్థ ఉండాలి. మోడల్‌, గురుకుల, మైనారిటీ గురుకులాల తరహాలో జిల్లా పరిషత్‌ గురుకులాల ఏర్పాటు చేసి టీచర్ల పిల్లలకు కూడా ప్రవేశాలు కల్పించాలి.మండల, జిల్లాపరిషత్‌ స్కూళ్ల విద్యా ర్థులపై పెట్టే సగటుఖర్చును గురుకుల విద్యార్థులస్థాయికిపెంచాలి.

ఏదిఏమైనా పిఆర్‌సీ రిపోర్టు రేకెత్తించిన అంశంపై విస్తృత చర్చ జరగాలి. విధాన నిర్ణేతలు ఇకనైనా విద్యపై దృష్టి సారించి సంస్క రణలు తేవాలి. అసమాన విద్య,భవిష్యత్తులో అసమాన సమాజా విర్భావానికి దారితీస్తుంది.అందువల్ల విద్యలో సమానత్వంఉండాలి. ఒకే విద్య నేర్చిన వారు వారి ప్రతిభాపాటవాలతో పైకెదిగితే పర్వాలేదు.కాని పునాది స్థాయిలోనే అంతరాల విద్యనందిస్తే, అంతరాలు ఉన్న సమాజాన్ని మనమే సృష్టించినట్లవుతుంది.

ఈ అంతరాలు తీవ్రమైతే ఇది సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ప్రైవేట్‌ విద్యను నియంత్రించడం,ఫీజుల నియంత్రణ, నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలలను మూసివేయడం, టెక్నో, కాన్సెప్ట్‌ పేర్లు తొలగించడం, ప్రభుత్వ పంచాయతీరాజ్‌, మోడల్‌ గురుకుల, తదితర పాఠశాలలను ఏకీకృతంచేసి ఒకే విధమైన గురుకుల,సెమి రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దటం, విద్యకు అధిక నిధులు కేటాయించడం,ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ ప్రవేశపెట్టడం,తనిఖీ వ్యవస్థను ఆధునీకరించడం, ఆధునిక తరగతిగదులు, సదుపాయాలు, డిజి టల్‌ బోర్డుల ఏర్పాటు,నో బ్యాగ్‌ విధానం,తదితర సంస్కరణలతోనే అన్నివర్గాల వారిని తిరిగి సర్కారు బడికి రప్పించగలం.

  • తండ ప్రభాకర్‌ గౌడ్‌