చెడ్డీగ్యాంగ్ కు వణికిపోతున్న ఏపీ ప్రజలు

చెడ్డీగ్యాంగ్ అంత ఇప్పుడు ఏపీలో దిగారు. రాత్రి ప‌డితే చాలు చెడ్డీలు ధరించి, చేతుల్లో మార‌ణాయుధాలు ప‌ట్టుకొని సంచరిస్తారు. అడ్డోస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు. అడ‌వాళ్లు క‌నిపిస్తే అత్యాచారాలకు బరితెగిస్తారు. గత కొంతకాలంగా హైదరాబాద్ శివార్లలో హడలెత్తిస్తున్న ఈ గ్యాంగ్..ఇప్పుడు ఏపీ ఫై ఫోకస్ పెట్టారు.

ఈ నెల 1న అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీగ్యాంగ్.. ఈ నెల 3న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. చెడ్డీగ్యాంగ్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఐదుగురు దుండగులు గడ్డపారలతో తలుపులు పగలగొట్టి 37, 39, 44 నంబరు విల్లాల్లోకి చొరబడ్డారు. ఇవి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఓ వ్యాపారికి సంబంధించిన విల్లాలు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఏమీ లభించకపోవడంతో వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు.

తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలను చడ్డి గ్యాంగ్ వణికిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు నమోదుకావండంతో ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శివారు ప్రాంతాల అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. విజయవాడ చిట్టినగర్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నగలు, నగదు దోపిడీ చేశారు. విజయవాడలో చెడ్డీ గ్యాంగ్‌ ముఠాలు రెచ్చిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్నీ చోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు చోట్ల ఒకే ముఠా పనేనా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. దీంతోపాటు శివారు ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ పెంచారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం చీకటైతే వణికిపోతున్నారు.