చలపతిరావు మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ మరణ వార్త నుండి ఇంకా సినీ జనాలు బయటపడకముందే చలపతిరావు మరణ వార్త చిత్రసీమను శోకసంద్రంలో పడేస్తుంది. చలపతిరావు మరణ వార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియపరుస్తున్నారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చలపతిరావు మృతికి సంతాపం తెలిపారు. చలపతిరావు మరణం సినీరంగానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు వెండితెరపై నటుడు చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. వందలాది చిత్రాల్లో చలపతిరావు వైవిధ్యమైన పాత్రలు పోషించారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. చలపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.

చలపతిరావు మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.చలపతిరావు అకాల మృతి వార్త తెలుసుకొని జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావు కుటుంబ సభ్యులను మంత్రి తలసాని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.మూడు తరాల నటులతో నటించిన గొప్ప నటుడు చలపతిరావని అన్నారు.