గ్రేటర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల్‌ పై ఉత్కంఠం

రెండు పదవులు టిఆర్‌ఎస్‌కే?

హైదరాబాద్‌: నేడు గ్రేటర్‌ మేయర్‌ ఎన్నిక పై స్పష్టత రానుంది. సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ఈ రెండు పదవులు అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అయితే, బరిలో మాత్రం టిఆర్ఎస్‌తోపాటు బిజెపి, ఎంఐఎం కూడా ఉన్నాయి. అయితే, మేయర్, ఉప మేయర్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని, పార్టీ ఎన్నికల పరిశీలకులైన మంత్రులు కెటిఆర్‌, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సీల్డ్ కవర్‌ను తెరుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం ఈ ఉదయం 10.45 గంటలకు కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్ అఫీషియోలు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.11 గంటలకు వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 11.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు.

మరోవైపు, మేయర్ అభ్యర్థులను నిలబెడుతున్న టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే, ప్రస్తుతం పార్టీల బలాబలాలను బట్టి చూసుకుంటే రెండు పదవులూ టిఆర్ఎస్‌కే దక్కే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికకు 97 మంది సభ్యుల మద్దతు అవసరం. టిఆర్ఎస్‌ 56, బిజెపికి 47 (గెలిచిన అభ్యర్థులలో ఒకరు చనిపోయారు. ఆయనను మినహాయించి), ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. టిఆర్ఎస్‌కు 32 మంది, బిజెపికి ఇద్దరు, ఎంఐఎంకి 10 మంది ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ టిఆర్ఎస్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.