ఈనెల 13నుండి టీకా రెండో డోస్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు

టీకా వయల్స్ సిద్ధంగా ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిలీ: భారత్‌లో ఈ నెల 13 నుంచి తొలి విడత వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండో డోస్ ను ఇచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ దాదాపు 45 లక్షల మందికి తొలి డోస్ టీకాను ఇవ్వడం జరిగింది.

జనవరి 16న తొలి డోస్ తీసుకున్న వారికి 13న రెండో డోస్ ఇస్తారని, ఆపై 17న తీసుకున్న వారికి ఈ నెల 14న రెండో డోస్ అందుతుందని, ఇలా నిత్యమూ రెండో డోస్ లను ఫ్రంట్ లైన్ యోధులకు ఇవ్వడం జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వ్యాఖ్యానించారు. ఇక, రెండో డోస్ కు సంబంధించిన టీకా వయల్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ, వీటిని రెండు రోజుల ముందుగానే వ్యాక్సినేషన్ కేంద్రాలకు అందిస్తామని స్పష్టం చేసింది.

ఇదిలావుండగా, దేశంలో కరోనా మహమ్మారిపై గురువారం నాడు సమీక్ష నిర్వహించిన ఆరోగ్య శాఖ, దేశంలోని 47 జిల్లాల పరిధిలో గడచిన మూడు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలియజేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, 251 జిల్లాల్లో మూడు వారాలుగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని తెలిపారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 1.60 లక్షలకు దిగువన ఉన్నాయని, వీటి సంఖ్య నిత్యమూ తగ్గిపోతోందని పేర్కొన్నారు.

ఇక పరీక్షల నిమిత్తం సేకరిస్తున్న నమూనాల సంఖ్యతో పోలిస్తే, పాజిటివిటీ రేటు కూడా 5.42 శాతానికి తగ్గిందని, ముఖ్యంగా గత వారంలో పాజిటివిటీ రేటు 1.82 శాతంగా నమోదైందని, యాక్టివ్ గా ఉన్న కేసుల్లో కేరళ, మహారాష్ట్ర ముందు నిలిచాయని, 70 శాతం యాక్టివ్ కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని అన్నారు. రికవరీ రేటు 97 శాతం దాటిందని వెల్లడించారు. ఇండియాలోని ప్రతి పది లక్షల మందిలో 1,44,359 మందికి పరీక్షలు నిర్వహించగా, 7819 పాజిటివ్ కేసులు వచ్చాయని, 112 మంది చనిపోయారని అన్నారు.