ఆక్స్​ ఫర్డ్​-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ కు నిపుణుల మద్దతు

దక్షిణాఫ్రికా అధ్యయనం నేపథ్యంలో స్పందన

న్యూఢిల్లీ: ఆక్స్‌ ఫర్డ్‌ -ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొత్త రకం కరోనాపై సమర్థంగా పనిచేయట్లేదంటూ దక్షిణాఫ్రికా అధ్యయనం తేల్చిన నేపథ్యంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సహా పలువురు అంతర్జాతీయ వైద్య నిపుణులు స్పందిస్తూ.. ఆక్స్ ఫర్డ్ టీకాకు మద్దతు తెలిపారు. ఇప్పుడొచ్చిన కొత్త రకం కరోనాలపైనా వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా అధ్యయనం గురించి భయపడాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్ వో చెప్పింది. రెండు డోసులకు మధ్య వ్యవధి ఎక్కువుంటే మంచి ఫలితాలు వస్తాయని ఇప్పటికే ట్రయల్స్ లో తేలిందని పేర్కొంది. కానీ, దక్షిణాఫ్రికా చేసిన అధ్యయనంలో కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇచ్చారని గుర్తు చేసింది. కాబట్టి రెండు డోసుల మధ్య ఎంత తేడా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయని వివరించింది.

రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత ఎక్కువుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని పదే పదే నిరూపితమైందని డబ్ల్యూహెచ్ వో వ్యాక్సినేషన్ చీఫ్ కేట్ ఓ బ్రియన్ అన్నారు. టీకా పనితీరు అంతంత మాత్రమేనని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్ వో ఆధ్వర్యంలోని వ్యాక్సిన్ సరఫరా గ్రూప్ కొవ్యాక్స్ కి సహ నేతృత్వం వహిస్తున్న కోలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్ సీఈవో రిచర్డ్ హాచెట్ అన్నారు. ప్రస్తుతం ఉన్న కొత్త రకం కరోనాపైనా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పనిచేస్తుందన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు.

దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ పై ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పనిచేయదని చెప్పడం చాలా తొందరపాటే అవుతుందని కొవిడ్ పై వేసిన ఆ దేశ మంత్రిత్వ సలహా కమిటీ సహ చైర్ పర్సన్ ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీమ్ అన్నారు. కాగా, ఇప్పటికే ఆక్స్ ఫర్డ్జఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని బ్రిటన్ ప్రధాని చెప్పారు. తాజాగా ఫ్రాన్స్ కూడా ఆ వ్యాక్సిన్ పై అనుకూలంగా మాట్లాడింది. వ్యాక్సిన్ తో కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వెరాన్ అన్నారు.

ఇటు అధ్యయనంలో వ్యతిరేక ఫలితాలు వచ్చినంత మాత్రాన టీకా సరఫరాను ఆపబోమని దక్షిణాఫ్రికా ప్రకటించింది. వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకెళతామని స్పష్టం చేసింది. ఏప్రిల్ లో డోసుల కాల వ్యవధి ముగిసిపోతుందని, ఆ లోపు వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు.