అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు పై ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజ‌ర్వేష‌న్లను రాష్ట్రంలోనూ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఈ మ‌ధ్యే సిఎం కెసిఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి అని సిఎం కెసిఆర్‌ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ర్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం ఉన్నది.