బోటు దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ

KRISHNA COLLECTOR
KRISHNA COLLECTOR

బోటు దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ

– కలెక్టర్‌ లక్ష్మీకాంతం
మృతుల కుటుంబాలకు రు.10లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయవాడ: బోటు దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్‌ బి లక్ష్మీకాంతం అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద బోటు దుర్ఘటన జరిగిన ప్రదేశంలో జిల్లాకలెక్టర్‌ ఆదివారం విజయవాడ సిపి గౌతం సవాంగ్‌, డిసిపి క్రాంతి రాణా టాటాలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులతో మాట్లాడుతూ సంఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతిచెందారని వారందరికి సంతాపం తెలిపారు. ఇంకా 7 గురి ఆచూకీకోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, 15 మంది ప్రమాదంబారినుండి బయటపడ్డారని కలెక్టర్‌ వెల్లడించారు.

ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు దర్యాప్తులో పాల్గొంటారని తెలిపారు. ప్రమాద మృతులకు రు.10లక్షలు, చంద్రన్న బీమా వర్తించనివారికి రు.8లక్షలు ఎక్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. సంఘటనా స్థలానికి రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, పి నారాయణ, కాలవ శ్రీనివాసులు, భూమా అఖిల ప్రియ, స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మన్మోహన్‌ తదితరులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.