హోం గార్డుల‌కు పెరిగిన వేత‌నం ఫిబ్ర‌వ‌రి నుంచి..

home gaurds
home gaurds

హైద‌రాబాద్ః సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డుల వేతన సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చింది. హోంగార్డుల రోజువారి వేతనాన్ని రూ.400 నుంచి రూ.675కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెరిగిన వేతనం ప్రకారం హోంగార్డులకు నెలకు రూ.20,250 అందనుంది. పెరిగిన ఈ వేతనం ఫిబ్రవరి నెల నుంచిహోంగార్డులు అందుకో నున్నారు.  ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జీతంలో రూ.వెయ్యి పెంపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న 2500 మంది హోంగార్డులకు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల తరహాలో వేతనంలో 30ు పొల్యూషన్‌ అలవెన్సు లభిస్తుంది. పోలీస్‌ సిబ్బందికి ఇస్తున్న విధంగానే యూనిఫాం, బందోబస్తు అలవెన్సు చెల్లిస్తారు. మహిళా హోంగార్డులకు ఆరు నెలల ప్రసూతి సెలవు, పురుష హోంగార్డుకు 15 రోజుల పితృత్వ సెలవు అమల్లోకి వచ్చింది.
అయితే ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. పోలీస్‌ సిబ్బంది తరహాలోనే యూనిట్‌ పోలీస్‌ ఆసుపత్రిలో హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం చెల్లించే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. కాగా హోంగార్డులతోపాటు కుటుంబసభ్యులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్న మరో ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వనుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉత్తర్వుల పట్ల హోంగార్డులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.