హెడ్‌ కానిస్టేబుల్‌.. నాకు స్పెషల్‌ మూవీ!

JAYASUDHA
JAYASUDHA

హెడ్‌ కానిస్టేబుల్‌.. నాకు స్పెషల్‌ మూవీ!

పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. చదలవాడ పద్మావతి నిర్మించిన హెడ్‌ కానిస్టేబుల్‌ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సహజనటి జయసుధ సినిమా గురించిన సంగతులను పాత్రికేయులకు తెలియజేశారు…

సహజనటి జయసుధ మాట్లాడుతూ.. హీరోయిన్‌గా, నటిగా నలబై ఐదేళ్ల కెరీర్‌లో నాకు ఈ సారి సినిమా విడుదలవుతుంటే ఒక పక్క ఆనందంగానూ, మరో పక్క భయంగానూ ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న శతమానం భవతి, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య అనే రెండు చిత్రాల్లో నేను నటించాను. హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య చిత్రం విషయానికి వస్తే.. యాబై ఎనిమిదేళ్ల వయసులో నారాయణమూర్తిగారితో కలిసి మొదటిసారి నటించాను. ఓ రకంగా చాలా స్పెషల్‌ మూవీ. అసలు ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పుడు ఇద్దరం ఫ్రేమ్‌ ఎలా ఉంటామోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా చేసిన చదలవాడ శ్రీనివాసరావుగారితో మంచి అనుబంధం ఉంది. ఆయన నిర్మాతగా చేసిన ఐదు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం సమాజంలోని సమస్యను బేస్‌ చేసుకుని తెరకెక్కిన సినిమా. ఆర్‌.నారాయణమూర్తి సినిమాల స్టయిల్లో ఉండే కమర్షియల్‌ సినిమా, అలాగే మంచి మెసేజ్‌ ఉన్న సినిమా ఇది. నేను, నారాయణమూర్తిగారు పోటీపడి నటించాం. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నాం. సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అన్నీ సినిమాలు బాగా ఆడాలి. మా హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య సినిమా ఇంకాస్తా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.