హుస్సేన్ సాగ‌ర్ శుద్ధికి టెండ‌ర్స్‌

HUSSAIN SAGAR
HUSSAIN SAGAR

హైద‌రాబాద్ః హుస్సేన్‌సాగర్ నుంచి వెలువడే దుర్వాసనను అదుపు చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా వేసవిలో ఎండతీవ్రత, గణనీయంగా పెరిగే ఉష్ణోగ్రతలతో సాగర్‌లోని నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. ఈ సమయంలోనే కొద్ది నీటిలో ఉండే ఆక్సీజన్ శాతం ఇంకా తగ్గిపోతుంది. దీంతో ఈ నీటిలో ఎనరోబిక్ బ్యాక్టీరియా ఉత్పత్తి పెరిగి జీవ ఆక్సీజన్ (బీవోడీ) గణనీయంగా పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే భరించలేని దుర్వాసనలు వెదజల్లుతాయి. దీంతో ఈసారి వేసవిలో సాగర్ నుంచి వెలువడే దుర్వాసనను అదుపు చేసేందుకు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న రెమిడేషన్ పద్ధతికి హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసేందుకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ ఇంజినీరింగ్ విభాగం టెండర్ల ద్వారా దరఖాస్తులను కోరింది. డీవో, బీవోడీలను అదుపులోకి తీసుకొచ్చి వేసవిని గట్టెక్కించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రెమిడేషన్ విధానం నిర్వహణలో 10 ఏండ్ల అనుభవం, ఏడాదిలో కనీసం రూ.2 కోట్ల మేర పనులు చేసి ఉన్న ఏజెన్సీకి ఈ పనులు కేటాయించేలా నిబంధనలు విధించారు. ఈ శుద్ధి పనులకు ఆసక్తి గల ఏజెన్సీలు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు టెండర్ నోటిఫికేషన్‌లో కోరారు. అర్హత కలిగిన ఏజెన్సీలను ఎంపిక చేసి పనులను అప్పగించనున్నామని, స్వచ్ఛ హుస్సేన్‌సాగర్ లక్ష్యంగా పనిచేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.