హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాకే..కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్

హుజూరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. ఆ నియోజ‌క వ‌ర్గంలో పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక‌ కోసం ప్రణాళిక‌లు వేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాష‌ణ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ కార్యకర్తతో ఫోన్‌లో ఆయ‌న మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీచేయ‌డానికి ఆ టికెట్‌ తనకే ఖ‌రారైన‌ట్లు తెలిపారు. ఎన్నిక నేప‌థ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్క‌రికీ 2 లేక 3 వేల రూపాయ‌ల చొప్పున‌ ఇస్తానని అన్నారు.

దీనిపై కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని ఆ కార్య‌క‌ర్త‌కు కౌశిక్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కూడా కౌశిక్‌రెడ్డి కలిశారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండడం క‌ల‌క‌లం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్రతిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కౌశిక్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ తనవైపునకు తిప్పుకుంటుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరోవైపు కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ, గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. ఆయనపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫోన్ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని… లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/