హిందువులకు ఒక సంవత్సరం…ముస్లింలకు మూడేళ్లు

asaduddin owisi
asaduddin owisi

కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దిన్‌ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం ఎంపి అసదుద్దిన్‌ ఓవైసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను, ప్రతిపక్షాలను ఎవరినీ పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. స్పీకర్‌ విచక్షణ అధికారాలు ఉపయోగించి బిల్లులు జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వ్యభిచారం, హోమోసెక్సువాలిటీ నేరం కాదని సుప్రిం కోర్టు చెప్పడాన్ని సమస్యగా పరిగణించని వారు ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. బార్యకు అన్యాయం చేసే హిందూ భర్తకు కేవలం ఒక యేడాది మాత్రమే శిక్ష విధించే అవకాశం ఉందని, అయితే అదే నేరం చేసిన ముస్లిం భర్తకు మూడేళ్ల జైలు శిక్ష ఎందుకు విధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మతం ఆధారంగా శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్నారని ముస్లిం మతం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. ఇస్లాం ప్రకారం విహానం ఓ కాంట్రాక్టు అన్నారు. భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటే మూడు సార్లు మెహర్‌ ఇవ్వాలని నిఖానామాలో పేర్కొంటారని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ను సింగిల్‌ తలాక్‌గా పరిగణించే నిబంధనలు ఉన్నాయన్నారు.