హాకీలో భార‌త్ ఓట‌మి

Hockey
Hockey

 జకార్తా : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పురుషుల హాకీ జట్టు మలేషియా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో అప్రతిహాత విజయాలతో సెమీస్‌కు చేరిన భారత్‌ మలేషియా చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో 6-7 గోల్స్‌ తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్‌ 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. నాల్గో క్వార్టర్‌ 59వ నిమిషం వరకు 2-1 గోల్స్‌ ఆధిక్యంలో నిలిచి చివరి నిమిషంలో గోల్‌ సమర్పించుకొని షూటౌట్‌కు వెళ్ళాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకొంది. 33వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, 40వ నిమిషంలో వరుణ్‌ కుమార్‌ పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేశారు. మలేషియా ఆటగాళ్లు ఫైజల్‌ సారీ, మహ్మద్‌ రజీ గోల్స్‌ చేశారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. అనంతరం ఇరుజట్లకు ఐదు పెనాల్టీ షూటౌట్‌లను నిర్దేశించగా… ఇరుజట్లు 2-2 గోల్స్‌ మాత్రమే చేయగలిగాయి. దీంతో షూటౌట్‌ పెనాల్టీలను నిర్దేశించగా మరో మూడుగోల్స్‌ మలేషియా చేయగా… భారత్‌ రెండుగోల్స్‌ మాత్రమే చేసి ఏడో గోల్‌ చేయడంలో విఫలమైంది. దీంతో మలేషియా జట్టు హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లగా… భారతజట్టు కాంస్యానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. తొలినుంచీ మలేషియాపై ఆధిపత్యాన్ని చెలాయించినా గోల్స్‌ చేయడంలో భారత ఆటగాళ్ళు ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ లభించినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మలేషియాను 2-1తో ఓడించినా… ఇరుజట్ల మధ్య 101 మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ 70 మ్యాచ్‌లలో గెలుపొందగా… మలేషియా కేవలం 13 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మరో 18 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.