స‌వ‌రించిన టీఆర్టీ నోటిఫికేష‌న్ జారీ!

tspsc
tspsc

హైద‌రాబాద్ః ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ చేసింది. పాత 10 జిల్లాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ప్రత్యేక బీఈడీ, డీఈడీ చదివిన వారు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల గడువును మరో 15రోజులు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,792 ఉపాధ్యాయుల నియామకం కోసం టీఎస్‌పీఎస్‌సీ గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే 31 జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టి… పాత పది జిల్లాలనే పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో 25ని సవరించింది. సర్కారు తాజా ఉత్తర్వుల ఆధారంగా గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించింది. ఉద్యోగ ఖాళీలను పది జిల్లాల వారీగా విభజిస్తూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఈనెల 15తో ముగియనున్న దరఖాస్తుల గడువును 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అదే ఉద్యోగానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్‌ స్పస్టం చేసింది. అయితే పాత పది జిల్లాల్లో దేని పరిధిలోకి వస్తారో పేర్కొంటూ ఆన్‌లైన్‌ దరఖాస్తులో మార్పులు చేసుకోవాలని తెలిపింది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.