స్వాతిని హంతకుడు కొట్టడం నేను చూశా

SWATHI
చెన్నైలో ఐటీ ఉద్యోగిని హత్య కేసులో కీలక సాక్ష్యం
చెన్నై : చెన్నైలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో సాక్ష్యం, మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి పలు వివరాలు వెల్లడించారు. పట్టపగలు చెన్నై, నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగా స్వాతిని హత్య చేసి వారం రోజుల తర్వాత ఒకరు ముందుకొచ్చి మాట్లాడారు. స్వాతి హత్యకు కొద్ది రోజుల ముందే స్వాతి ఓ వ్యక్తి కొట్టడం చూశానని చెన్నైకి చెందిన తమిళరసన్‌ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఆయన స్వాతి ఉండే ప్రాంతంలోనే ఉంటున్నారు. అయితే సీసీటీవీ పుటేజీలోని వ్యక్తి, అంతకు ముందు స్వాతిని కొట్టిన వ్యక్తి ఒక్కడు కాదని చెప్పారు. జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతిని గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన సమయంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌కు కొంచెం దూరంలో ఉన్నానని తమిళరసన్‌ తెలిపారు. తాను అక్కడికి వెళ్లేసరికి స్వాతి చనిపోయిందని చెప్పారు. ఈ హత్యతో తాను చాలా షాక్‌కు గురయ్యానని, ఆ తర్వాత రైల్లో అక్కడి నుంచి వెళ్లిపోయానని వెల్లడించారు స్వాతిని అంతకు ముందు నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లోనే ఓ వ్యక్తి నాలుగైదు సార్లు చెంపదెబ్బలు కొట్టాడని, ఈ విషయం ఎవరితోనైనా చెప్పడానికి భయపడ్డానని అన్నారు. స్వాతి హత్య కేసులో చెన్నై పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోను శుక్రవారం విడుదల చేశారు.