స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ

BEZAWADA KANAKADURGA
KANAKADURGA

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దసరా మహోత్సవాలు బుధవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి రుత్వికులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. బాల భోగ నివేదనలు, నిత్యార్చనలు పూర్తయిన తరువాత ఉదయం 8 గంటలకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అనుకున్న సమయం కంటే గంట ముందుగానే అమ్మవారి దర్శనం కల్పించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి.  తొలిరోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.. 11న బాలత్రిపుర సుందరీదేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న లలితాత్రిపుర సుందరీదేవిగా, 14న సరస్వతీదేవిగా, 15న అన్నపూర్ణా దేవిగా, 16న మహాలక్ష్మీదేవిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసుర మర్ధినిగా, రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 14న సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.