స్నేహమేరా శాశ్వతం

Ladies
Ladies Friendship

స్నేహమేరా శాశ్వతం

అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అర్ధం కదా. స్టూడెంట్‌ లైఫ్‌లో తల్లిదండ్రులు, అధ్యాపకులు తర్వాత స్నేహితుల పాత్ర ప్రాధాన్యత వహిస్తుంది. ముందు ముఖపరిచయంతో మొహమాటంగా మొదలై, తర్వాత సరదా సరదా కబుర్లతో కులాసాగా కొనసాగుతూ, ఆ తర్వాత ఇంట్లో ఏం జరిగినా అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా స్నేహితుని కలిసి చెప్పేవరకు మనసు కుదుటపడని చిక్కటి అనుబంధంగా బలపడుతుంది. నువ్వేనేను, నేనేనువ్ఞ్వ అన్నట్లుగా ఐకమత్యంగా ఓ కట్టుగా కలిసిపోయి ఉంటారు.

ఇంటికి తీసుకువచ్చి మా ఫ్రెండు అంటూ పరిచయం చేసి, తన ఫ్రెండు తన ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలని తహతహలాడుతుంటారు. ఇంట్లో పేరెంట్స్‌కి కూడా తమ పిల్లలు పరిచయం చేసిన ఆ ఫ్రెండు నడవడిక అది తమకి నచ్చితే సరే ప్రోత్సహిస్తారు. లేదంటే నెమ్మదిగా తమ పిల్లలకి నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తారు. పిల్లలకే కాదు కాలేజ్‌ లైఫ్‌లో ఆ తర్వాత వివాహమయ్యాక కూడా ఫ్రెండ్స్‌ కొనసాగుతూనే ఉంటారు. కొన్ని స్నేహాలు చిరకాలం కొనసాగుతుంటాయి. బంధువ్ఞలకంటే ఎక్కువగా స్నేహానుబంధమే చాలా గాఢంగా కనబడుతుంటుంది. నిజానికి సృష్టిలో తీయనిది స్నేహమే కదా. ఈ స్నేహానికి కులమతాలు బీదగొప్ప, ఆడమగ అన్న తారతమ్యం ఉండదు.

అందుకే స్నేహం చిరకాలం వర్ధిల్లుతుంది. సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు పరిస్ధితులను అర్ధం చేసుకుంటూ సర్వకాల సర్వావస్థ ల్లోను నేనున్నాని నిండుగా పలికే తోడు పేరే స్నేహం. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎడతెగని సమస్యతో సతమత మవ్ఞతున్నపుడు మనసుపడే ఆరాటాన్ని మరొకరితో పంచుకోవాలనుకుంటున్నపుడు మన మనస్సులో మెదిలే మొదటి వ్యక్తి మన స్నేహితులే ఒక్కోసారి ఇంట్లో వాళ్ళుతో కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో చెప్పుకొని ఎంతో ఊరట చెందుతాం.

వారి దగ్గర నుండి ఓదార్పుని పొందుతాం, సమస్య వ్ఞంటే చర్చించి పరిష్కారం చెప్పమని అడుగుతాం. అందుకే జీవితంలో ఎవరికైనా స్నేహితుల పాత్ర వారి ప్రాధాన్యం చాలా ప్రత్యేకం. వారి అనుబంధం అపురూపం. మీరెప్పుడైనా గమనించారో లేదో కానీ ఎవరు మధ్యనైనా చొరబడతారేమోకానీ స్నేహితుల మధ్య తలదూర్చటానికి ఎవరూ సాహసించరు. ఒకవేళ స్నేహితుల మధ్య ఎవరైనా చిచ్చుపెట్టాలని చూసినా నా ఫ్రెండ్‌ అలాంటి వాడు కాదంటూ కొట్టిపారేస్తాడు.

ఒకవేళ నిజంగా ఏదైనా పొరపాటుగా పొరపొచ్చాలు ఏవైనా వచ్చినా, ఒకరి గురించి ఒకరు ఆరాటపడిపోతూ ఎప్పుడెప్పుడు ఒకరికొకరుగా కలిసిపోయి ఆత్మీయంగా కౌగలించు కోవాలని ఎదురుచూస్తుంటారు. తమ మధ్యదూరం తాత్కాలికమే అనుకొంటారు. ఆ సమయంలో కూడా ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తారే కానీ కత్తులు దూయాలనుకోరు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా అలా ఉన్నారంటే అది నిజమైన స్నేహం కాదన్నమాట. అందుకే స్నేహం విలువ తెలిసినవారు ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని పాడుకుంటారు.