స్త్రీకి అర్ధం

                                        ‘స్త్రీ’కి అర్ధం

CUTE
CUTE

ఈ ప్రపంచమే విరుద్ధాల వలయం. ఈ విషయం తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు కళ్లముందున్న ఆ రూపాన్ని గుర్తించి, దానిని మరికాస్త నమ్మకం అనే పేరుతో ప్రాణం పోసి, ఆ ప్రాణాన్ని సరికొత్తగా ఆహ్వానించడమే ‘సమాజం అనే అంశంలోని భారతీయత. నాణాన్ని ఓ వైపు నుండి చూస్తే, ఓ నిజాన్ని కనుగొనడానికి కావల్సిన సాక్ష్యాలు సత్యాలుగా గోచరిస్తున్నా, వాటిని పక్కనపెట్టి అసలు రూపమేలేని మాయనే జీవించడమనే భ్రమలతో ముందుకుసాగితే జరిగేది ప్రళయమే. ఇదే నేడు స్త్రీ విషయంలోనూ జరిగింది. ఈ విషయాన్ని మరికాస్త సరళీకరించి చూద్దాం. ఉదాహరణకు ఇంటికి అతిధులు వచ్చారనుకోండి వారికి మర్యాదలు చేయడం ‘అతిధి మర్యాద సంస్కారం అవుతుంది. ‘అతిధి మర్యాద అనేది అంశం. ఇది మనకళ్లెదుట కనిపించే వాస్తవం. దీన్ని ఎవరూ ఖండించలేరు. కాని ఆ ‘అతిధి మర్యాద అనే అంశం నుండి పూర్తిగా దూరం చేస్తాయి. కనుక ఇక్కడ గుర్తించాల్సిన అంశం భారతీయతకు అసలైన అర్థం ‘సత్యం వద, ‘ధర్మం చర. అంటే మన కళ్లకు సాధారణంగా కనిపించే సత్యాన్ని గుర్తిస్తేనే అసలైన ధర్మపథంలో సమాజం, తరువాత ప్రపంచం నడుస్తాయి. ఇక్కడ భారతీయతనేది దేశానికి సంబంధించిన అంశం అనుకుంటే ‘అసలైన అతిధి మర్యాద అనే అంశాన్ని విడిచేసి వ్యక్తిగత కల్పనలను జోడించి, సత్యానికి దూరం కావడమే.

ఈ ప్రపంచంలోని ప్రతి అంశానికి మానవ సంబంధాలకు ‘భారతీయత అనేది సత్యంగా జోడించింది. దీన్ని కళ్లముందు కనిపించే సత్యంగా గుర్తించి దాని మీద నవ ప్రపంచాన్ని నిర్మించడమే నేటి సమాజం ముందున్న లక్ష్యం. ఇకపోతే ఇదే అంశం స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఆమె అనాది నుండే ఆదిశక్తి. కాని ఎల్లప్పుడు పరిష్కారం అన్నది కళ్లముందే ఉన్నా భ్రమల వల్ల అసలు స్త్రీ కి చెందని చట్రంలో బంధింపబడింది. నిజానికి ఆధిక్యత అనే అంశమే ఓ దృక్కోణం. అది ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. మనం సృష్టించుకున్నదే ఈ పురుషాధిక్యత. దీని నుండి బయట పడాలంటే సత్యాన్ని గుర్తించి, దాన్ని నమ్ముతున్నామనే విశ్వాసాన్ని ఆ సత్యానికే కల్పించాలి. ఈ సృష్టిలో శాశ్వతమైన సూత్రం ‘జీవితం సులభమైనది, దుర్లభమైనది. అది మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మీరుదాన్ని సులభతరం చేసుకుంటే కష్టపడకుండానే కళ్లముందుకొస్తుంది. అలాకాకుండా భ్రమలు కల్పించుకుంటే ఆ బంధనాలు ఇంకొన్ని చిక్కుముడులతో సాగుతూ సత్యానికి, పరిష్కారానికి మధ్య దూరాన్ని ప్రతిక్షణం పెంచుతుంటాయి. నేడు స్త్రీ అణచివేతకు గురవుతుందా?, ప్రగతిపధాన పురోగమిస్తుందా?

రెండింటిలో ఏకోణంలో చూసినా స్త్రీ అనే అంశాన్ని మరింత దుర్లభం చేసు ్తన్నట్లే. వాస్తవానికి స్త్రీ వ్యక్తికాదు. జాలి, సానుభూతి చూపించాల్సిన వ్యక్తి కాదు. ఆమె శక్తి ఆవిర్భావమైన మూలాధారం. నవనిర్మాణ శక్తిగా పరిగణిం చినప్పుడు మాత్రమే మగువ మనసుని అర్థం చుసుకునే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా స్త్రీ జడపదార్థం అని మీకు మీరే బలమైన పరిసరాల విపుల ప్రామాణికతతో క్షణక్షణం అభిప్రాయాల మాయను నిర్మిస్తూంటే, ఆమె ఎప్పటికప్పుడు తనను తాను మరింత జటిలం చేసుకుంటుంది. ఇప్పటికైనా ఆ భ్రమనుండి బయటపడితే సత్యాన్ని చూడగలుగుతాం. ఎప్పుడైతే స్త్రీ తన తత్వాన్ని అంత సులభంగా మీ ముందు పెడుతుందో, దాన్ని మీరు యదార్ధ మని అంగీకరించడానికి సిద్దంగా ఉండరు. సృష్టి ఎప్పుడు సంక్లిష్టతతోనే నిండి ఉండాలని, వాటిని సులభతరం చేయడం మీ బాధ్యతనే గెలుపుగా భావించి, దాన్నే జీవిత గమ్యంగా మలచుకున్నారు. మనం మనల్ని నమ్ముకోం, అది బాహ్య అంశమని భావించి దాన్ని వెతుకుతుంటాం.

‘నీనుండి నీవు దూరమై పోయాక సత్యం అనేది క్రమక్రమంగా తన రూపాన్ని మార్చుకుంటుందని, చివరికి అది మాయ అనే రూపంలో మీ దగ్గరకు వచ్చేసరికి, అది కూడా మీలానే తన ఉనికిని మీ భావనకు తగ్గట్టుగానే ఇముడ్చుకుంటుందని గమనించాలి. అందుకే జీవితం అనేది జీవించడానికి అనే విషయాన్ని మనం మరచిపోయాం. జీవితం అనేది కష్టపడటానికి అనే మాయలో బ్రతుకుతూ, అభద్రత, అశక్తత, స్వార్థం, డబ్బు లను ప్రాణశ్వాసలా మార్చి శ్వాసను జీవిగా మారుస్తున్నాం. అందుకే స్త్రీ విషయంలో ఎన్నో మార్పులు కాలానికి తగినట్లుగా వస్తున్నా, స్త్రీ అంటే స్పష్టత ఇంకా రాలేదు. దీనికి మన ‘మగువ మనసు ఎవరికి అర్థంకాదు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే భాష్యాలు జోడిస్తున్నాం. దానిలో మన అసమర్థతను, అభద్రతను ప్రపంచానికి కావల్సిన తెలివిగా గుర్తిస్తున్నాం. నీలో నిన్ను వెతుక్కో, ఎదుటివారిలో నిన్ను నీవు చూసుకున్నంత వరకు అసలు నీవు అన్నదే అంతమైపోయిన అంశమని గుర్తుంచుకో. అలాగే స్త్రీ ని తనలోనే వెతుకు.

ఆమెను పురుషులతో, కట్టుబాట్లతో, కుటుంబాలతో, స్వయంసంస్కారాలతో జోడిస్తే ఆమె నీకెప్పుడూ అర్థంకాదు. అసలు లక్ష్యమే లేకుండా గెలుపుకోసం ప్రయత్నించడం ఎంతవరకు సబబు? అదే నేటి సమాజంలో జరుగుతున్నది. అందుకే అనాది నుండి స్త్రీ అసలు లేనే లేదు. ఎందుకంటే ఆమెని ఎవరూ చూడలేదు కనుక. ఇపుడు సృష్టిలో జరుగుతున్న తప్పు అందరికి అర్థమయ్యే ఉంటుంది. స్త్రీ పుట్టినప్పుడే మరణించింది. ముందు ఆమె జన్మిస్తేనే తనేంటో తెలుసుకునే ప్రక్రియ మొదలవుతుంది. కనుక ఇప్పుడు చేయాల్సింది లేని అంశం పై మాయలు కల్పించి దాన్ని తరతరాలుగా కొనసాగించకుండా స్త్రీకి జన్మనివ్వాలి. ప్రతి ముగింపు ఒక ఆరంభం అనేది నేటి ప్రపంచ సృష్టికి కావల్సిన శక్తి. ఆ ముగింపుకు నేడు స్వాగతం పలికి, ఆరంభానికి ఆదివాక్యం పలకాలి. ఓ కొత్త సమాజం నిర్మించాల్సిన అవసరం నేడుంది. అది సత్యం అనే భారతీయతపై నిర్మిస్తేనే స్త్రీ శక్తి ఆవిర్భవిస్తుంది. అది త్వరలోనే స్త్రీని పరిచయం చేసి ఎప్పటికి అంతరించని నవసమాజ నిర్మాణానికి నాంది పలుకుతుంది.
– శృంగవరపు రచన