స్టెరిలైట్‌లో టన్నులకొద్దీ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌

STERILITE
STERILITE

ట్యూటికోరన్‌: వేదాంతగ్రూప్‌ స్థాపించిన స్టెరిలైట్‌ కాపర్‌ స్మెల్టర్‌ ప్లాంట్‌నుంచి సల్ఫ్యూరిక్‌ ఆసిడ్‌ లీక్‌ అవుతున్నదన్న ఫిర్యాదులపై అధికారులు సుమారు 1300 టన్నులవరకూ ఉన్న రసాయనాన్ని ఫ్యాక్టరీ ఆవరణనుంచి తొలగించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి మాట్లాడుతూ మొత్తం 1300 టన్నులవరకూ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ను 75 ట్యాంకర్లలో నింపి అక్కడినుంచి తొలగించామని వివరించారు. ఈనెల 17వ తేదీ ఈ ఫ్యాక్టరీనుంచే యాసిడ్‌ లీక్‌ అవుతున్నట్లు ఫిర్యాదులు అందుకున్నారు. ఇదిలా ఉంటే స్టెరిలైట్‌ కాపర్‌ప్లాంట్‌ యాజమాన్యం మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌పై పిటిషన్‌ దాఖలుచేస్తూ యాజమాన్యం ధృవీకరించిన ప్రతినిధులను ఫ్యాక్టరీలోనికి అనుమతించాలనికోరింది. అంతేకాకుండా లీకేజిలు అరికట్టు ప్రమాదకరరసాయనాలను పోలీస్‌ రక్షణతో అక్కడినుంచి తొలగించేందుకు అనుమతించాలనికోరింది. విద్రోహచర్యలకారణంగానే ఈ లీకేజి వచ్చిందని ఆరోపించింది. స్టెరిలైట్‌ప్లాంట్‌ మూసివేయాలనికోరుతూ నిర్వహించిన ఆందోళనలు ఉదృతం కావడంవల్లనే గతనెల 22,23తేదీల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది చనిపోయారు. అంతేకాకుండా ఈప్రాంతంలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు అలుముకున్న సంగతి తెలిసిందే.