సోలార్‌ పంపుసెట్లు.. ఎపిలో సాగునీరు జలజల తెలంగాణలో రైతులు విలవిల

SOLAR
సోలార్‌ పంపుసెట్లు..
ఎపిలో సాగునీరు జలజల
తెలంగాణలో రైతులు విలవిల
కేంద్రం సాయానికి ముందుకువచ్చినా, ఉపయోగించుకోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం!
హైదరాబాద్‌ : విద్యుత్‌ సరఫరా వ్యవస్థ విస్తరించని మారుమూల ప్రాంతాల రైతాంగానికి కేంద్రం అందించిన వరప్రసాదం.విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎఇ కార్యాలయాల చుట్టు చెప్పు లరిగేలా తిరగాల్సిన దైన్యస్థితిని దూరం చేసే పథకం. ట్రాన్స్‌ ఫార్మర్లు మంజూరైన తర్వాత కూడా వేలకు వేలు లంచాలు ఇచ్చుకో వాల్సిన దుస్థితిని కాపాడేవరం. సౌరవిద్యుత్‌ వ్యవసాయ పంపుసెట్ల పథకం.ఐనదానికి కానిదానికి కేంద్రం సహకరించడం లేదని ఒంటి కాలిపై విరుచుకపడే తెలంగాణ నాయకత్వం వచ్చిన పథకాలను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నదనేది ఎవరికి అర్థం కాని బ్రహ్మపదార్థం. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మంజూరు చేసిన సోలార్‌ పంపుసెట్ల పథకం అమలవుతున్న తీరు నిరాశజనకంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంజూరైన 6,725 యూని ట్లకు ఇప్పటికే 2,400 యూనిట్లు రైతులకు అందజేశారు. మిలిగిన వాటిని సాధ్యమైన త్వరగా ఇవ్వడానికి రంగం సిద్ద చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన 4,200 యూనిట్లలో ఒక్కదానికి మోక్షం లభించలేదంటే అతిశయోక్తి కాదేమో.

2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు ముంగిట్లో ఉన్నా తెలంగా ణలో ఇంకా అత్యున్నతస్థాయి సమావేశాలు, సమీక్షలతోనే కాలం గడిచిపోతోంది. విద్యుత్‌ సరఫరావ్యవస్థలేని మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి నానాఅవస్థలు పడుతున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాదించిన సౌరవిద్యుత్‌ పంపుసెట్ల పథకం తెలంగాణ ప్రభుత్వ శాఖలమధ్య కొరవడిన సమన్వయంతోసమస్యగా మారింది. తెలంగాణకు కేంద్రం కేటాయించిన సౌరవిద్యుత్‌ పంపుసెట్ల వ్యవహారం పూటకో మలుపుతో మధ్యలోనే అస్తమించేటట్లుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా వీటికి మోక్షం కల్పిస్తారనే భరోసా లేకుండా పోయింది. గత డిసెంబరులో కాస్తా హల్‌చల్‌ చేసిన ప్రభుత్వం సమీక్షలకు దూరమైంది.

5 హెచ్‌పి సౌరవిద్యుత్‌ పంపుసెట్‌ ధర దాదాపు రూ.4లక్షల 29వేలు కాగా. 3హెచ్‌పి పంపుసెట్‌ ధర రూ.3లక్షల 34 వేలు. 5హెచ్‌పి సోలార్‌ పంపుకు రూ.1లక్ష 62వేలు, 3హెచ్‌పి మోటార్‌కు రూ.97వేలు రాయితీ కింద కేంద్రం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 4,200 సౌర విద్యుత్‌ వ్యవసాయ పంపుసెట్ల మంజూరీ, లబ్దిదారుల ఎంపిక, మోటార్లు సరఫరా చేసే ఏజెన్సీల గుర్తింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే 10 నెలలు గడిపేశారు. కేంద్రం ఇస్తున్న రాయితీకి అదనంగా ఒక్కో యూనిట్‌పై తాము అదనంగా రూ.1లక్ష వరకు రాయితీ భరిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మొత్తం పథకాన్నే అంపశయ్యపైకి ఎక్కించింది. ఇందుకోసం గత ఏడాడి ఫిబ్రవరి నెెలలో రూ. 120 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పంపుసెట్ల ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేకించి ఫలాన శాఖకు అప్పగించకుండా చేతులు దులుపుకుంది. సౌరవిద్యుత్‌ పంపుసెట్ల కంపెనీల ఎంపిక, విధివిధానాలను తయారు చేసే బాధ్యతలను నూతన, పునరుద్దరణీయ సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థకు అప్పగించింది.

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 4,200 సౌర విద్యుత్‌ పంపుసెట్ల కోసం ఫిబ్రవరిలో నిర్వహిం చిన టెండర్ల వ్యవ హారం అడ్డందిడ్డంగా మారింది. ఒక క్యాబినెట్‌ మంత్రి యూనిట్‌ ధరలు అధికంగా ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేయయంతో నిజనిజాలను పరిశీలించకుండానే ప్రభుత్వం టెండర్లను రద్దుచేసింది. దీనిపై తుదినిర్ణయం తీసుకోవడానికి వ్యవసాయ, ఇంధన, పరిశ్రమలశాఖలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఒక సబ్‌ కమిటీ నియమించారు. 10నెలల కాలంలో సదరు సబ్‌ సబ్‌కమిటీ సమావేశమైంది లేదు. సౌరవిద్యుత్‌ మోటార్ల ఏర్పాట్లపై నిర్ణయం తీసుకున్నది లేదు.

ఒక సౌరవిద్యుత్‌ వ్యవసాయ పంపుసెట్‌పై 5హెచ్‌పి యూనిట్‌కు కేంద్రం దాదాపు రూ.1లక్ష 62వేల రాయితీ ప్రకటించింది. రాష్ట్రంలో రాష్ట్రా నికి మంజూరైన 4,200 సౌరవిద్యుత్‌ పంపుసెట్లకు కేంద్రం ప్రకటించిన రాయితీకి అదనంగా మరో 1లక్ష వరకు రైతులకు రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. సౌరవిద్యుత్‌ పంపుసెట్‌ వ్యయం సుమారు రూ. 4లక్షల 29 వేల అంచనాతో కేంద్ర నూతన పున రుద్దరణీయ ఇంధనశాఖ రైతులకు రూ.1.62లక్షల రాయితీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రూ.1 లక్ష కలిస్తే సౌర విద్యుత్‌ పంపుసెట్‌ ఏర్పాటు చేసుకునే రైతు యూనిట్‌పై రూ.1లక్ష 78వేల వరకు భరించాల్సి ఉంటుంది. దీనిపై బ్యాంకుల నుంచి రుణసదు పాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం యూనిట్‌పై రూ.1లక్ష వరకు రాయితీ ఇస్తామని సంసిద్దత వ్యక్తం చేయడంతో ఎంపికైన లబ్దిదారులు చెల్లించాల్సిన 11శాతం మొత్తం ఇందులోనే కలిసిపోతుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతు చెల్లించాల్సిన 50 శాతం మొత్తాన్నీ పవర్‌ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (పిఎఫ్‌సి) ద్వారా రుణం పొందిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవడం సత్ఫలితా నిస్తోంది. తెలంగాణలో మాత్రం 50శాతం నిధుల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సిందేనని అంటు న్నారు.
తాజాగా విధించిన నిబంధనల ప్రకారం టెండర్‌లో పాల్గోన్న కంపెనీలు సౌరవిద్యుత్‌ పంపుసెట్లు, వాటిప్యానెల్‌ అమర్చాలి. ఐదుసంవత్సరాల వారంటీ, ఇన్స్‌రెన్స్‌ కల్పిస్తు జిపిఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించి పంపుసెట్ల పనితీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను పక్కాగా చేపట్టడానికి సదరు సంస్థలు ముందుకు వచ్చినా ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపించలేదు. కాగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తగ్గిన సౌరవిద్యుత్‌ యూనిట్‌ ధరతో త్వరలో తిరిగి టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు రంగం సిద్దమవుతూనే ఉంది.

ఎపిలో ఇలా అమలవుతోంది..
నూతన.పునరుద్దరణీయ ఇంధనవనరుల వినియో గంలో భాగంగా సౌరవిద్యుత్‌ పంపుసెట్ల ఏర్పా టుకు కేంద్రప్రభుత్వం కేటాయిస్తున్న సౌరవిద్యుత్‌ పంపుసెట్ల పథకం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ఇంధన శాఖ తీసుకుం టున్న చర్యలు, రైతాంగం ప్రదర్శిస్తున్న ఆసక్తి విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని రైతులకు ఆపద్బాం దవుడిలా ఆదుకుంటోంది. సౌరవిద్యుత్‌ పంపుసెట్‌ యూనిట్‌ రూ.4లక్షల 40వేలలో కేంద్ర రాయితీ రూ. 1లక్ష 62వేలు పోగా మిగతా మోత్తాన్నీ అక్కడి పంపిణీ సంస్థలే సమకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా నికి కేంద్రం విడుదల చేసిన 5,800 పంపుసెట్లకు గాను ఇప్పటికే 3,400 మంది రైతులకు ఆరాష్ట్ర ఇంధనశాఖ పంపుసెట్లను ఆమర్చింది. మిగిలిన 2,400 పంపుసెట్లను ఫిబ్రవరి చివరి నాటికి వ్యవసాయదారులకు అందజేయనున్నారు.

పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సౌరవిద్యుత్‌ పంపుసెట్ల ఏర్పాటు మొదటి దశలోనే 3,400 మంది రైతులకు అందుబాటులోకి రాగా తెలంగాణ రాష్ట్రంలో సమీక్షలు, సమావేశాలు, వివాదాల నడుమ కేంద్రం ఇచ్చిన 4,200 సౌరవిద్యుత్‌ కనెక్షన్లను ఈఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే దాఖలాలు కనిపించడంలేదు. సౌరవిద్యుత్‌ పంపుసెట్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్న రైతాంగం పట్ల ఏపి ఇంధనశాఖ, ఏపిట్రాన్స్‌కో అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. రైతులు భరించాల్సిన ధరావత్తు డబ్బుతో పాటుగా వారు రుణంగా పొందాల్సిన డబ్బులను ఏపి విద్యుత్‌ పంపిణీ సంస్థలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నుంచి రుణంగా తీసుకుని సర్దుబాటు చేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటల విద్యుత్‌ పథకం కింద ప్రభుత్వం భరి స్తున్న రాయితీ మొత్తాన్నీ క్రమంగా తగ్గించుకునే చర్యలో భాగంగా ఏపి ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. విద్యుత్‌ సరఫరా లేని మారుమూల ప్రాంతాలు,గిరిజన ఆవాసాల రైతాంగాన్నీ ఎంపిక చేయడం ద్వారా విద్యుత్‌ సరఫరా ప్రసరణ వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం లేకుండా సౌరవిద్యుత్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. సౌరవిద్యుత్‌ వినియోగం ద్వారా పనిచేసే వ్యవసాయ పంపుసెట్లు సాయంత్రం దాటితే పనిచేయవు.ఈ సమయంలో రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళి ప్రమాదాల బారిన పడి పాముకాట్లకు గురై ప్రాణనష్టం తదితర సమస్యలు తగ్గుముఖం పడతాయనే ముందుచూపు బాగా పనిచేస్తోంది.