సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌కు చిక్కొద్దు

SAJJANAR
SAJJANAR

హైద‌రాబాద్ః సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతున్నా.. సైబర్‌ మోసాల బారిన పడే బాధితుల సంఖ్య తగ్గడం లేదు. సైబర్‌ నేరగాళ్లు విసిరే వలకు చిక్కిన తర్వాత గానీ బాధితులు కళ్లు తెరవడం లేదు. ఈ క్రమంలో మోసాలకు చిక్కకుండా ఉండేందుకు అవగాహన కల్పించడమే కీలకమని భావిస్తున్న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు క్రైమ్‌ డీసీపీ జానకిశర్మిల, ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించారు. సైబర్‌ నేరాలు జరిగే తీరుపై పోస్టర్లు ముద్రించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కమిషనర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. వీటిని పలు కీలక ప్రాంతాల్లో అతికించడంతోపాటు సైబర్‌ నేరాలు జరిగే విధానంపై లఘుచిత్రాల్ని రూపొందించి సినిమా థియేటర్లలో తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు.