సేకరణలో జ్ఞాన సముపార్జన

MAKE
MAKE

సేకరణలో జ్ఞాన సముపార్జన

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం పట్ల ప్రత్యేక అవగాహన, అభిరుచి కలిగి ఉంటారు. దాంతో వారు సునాయాసంగా ఆ పనిని చేయగలుగుతారు. వారి జ్ఞానాన్ని పదిమందికీ పంచి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వాటిలో సేకరణలు కూడా ఒకటి. సాధారణంగా స్టాంపుల సేకరణ, నాణెముల సేకరణల గురించి ఎక్కువగా వింటూ ఉంటాము.

వివిధ పత్రికల్లో వీటిపై వచ్చే ఎన్నో వ్యాసాలు, ఫొటోలు, ప్రదర్శనలు చూస్తూ ఉంటాము. అయితే ఎన్నో రకాల సేకరణలు ఉన్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి సేకరణను సులభంగా ప్రారంభించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

మొదట మీకు బాగా అవగాహన ఉన్న అంశాన్ని ఎంచుకొని దానికి తగిన విధంగా సేకరణలు చేయవచ్చు. ఇంకో విధమైన సేకరణలో, మీకు బాగా లభించే వస్తువుతోగానీ, వార్తాపత్రికలతోగానీ చేయవచ్చు.

ప్రతి వార్తాపత్రిక బాలల కోసం కనీసం ఒక పేజీ కేటాయిస్తోంది. అందులో మీకు ఉపయోగపడే అంశాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుండి కవితలు, కథలు, పజిల్స్‌, సూక్తులు, సామెతలు, నీతిపద్యాలు, గేయాలు, పాటలు, వింతలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖుల ఫొటోలు, జీవిత చరిత్రలు, కొన్ని అరుదైన సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, ప్రముఖ బాలలతో ఇంటర్వ్యూలు ఇలా కొన్ని అంశాలకు సంబంధించిన వాటిని కత్తిరించి పుస్తకాల్లో అతికించాలి. వాటికి బార్డరు గీసి, మంచి శీర్షికలుగా మలచాలి.

మరొక సేకరణలో మీకు నచ్చిన వివిధ పేపర్‌ కటింగ్స్‌ను ఒకచోట చేర్చి, వాటితో కథలు అల్లవచ్చు. చిత్రలేఖనానికి సంబంధించినవి, వ్యాసాలు, జాతీయ నాయకుల ఫొటోలు వారి జీవిత విశేషాలకు సంబంధించిన అంశాలను కత్తిరించి ఉంచాలి.

ఒక్కో సేకరణకు ఒక్కో పుస్తకాన్ని కేటాయించుకోవాలి. వీలు కాకుంటే ఒకే పుస్తకంలో రెండు లేక మూడు అంశాలుగా విభజించి చేసుకోవచ్చు. జాతీయ జెండాలు, చిహ్నాలు, శాస్త్రవేత్తలు, జాతీయ జంతువులు, మొక్కలు, పక్షులు, ఇలా వేటికవే విభజించి అతకాలి.

ప్రాముఖ్యతా దినోత్సవాలు, ఆరోగ్య సలహాలు, వంటలు, పాత క్యాలెండర్లు మొదలైనవి సేకరించి స్వయంగా నోట్సు తయారు చేసుకోవాలి.

వివిధ ఆకులను ప్రెస్‌ చేసి హెర్బేరియం తయారు చేయాలి. అలాగే పువ్వులనూ చేయవచ్చు. మీకు సంబంధించిన వివిధ ఫొటోలను ఆల్బమ్‌లో భద్రపరచండి. వివిధ పత్రికలలో సేకరణలపై వచ్చే విషయాలను గురించి తెలుసుకోండి.

మీరు సేకరించిన వాటిపై తయారుచేసిన నోట్సును ఇతరులకు వివరించి చెప్పండి. మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన సేకరణలు ఇతరులకు ఇవ్వకండి. విజ్ఞ్ఞానము, సమయ సద్వినియోగం, నలుగురితో కలివిడితనం మొదలగు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ఈ సేకరణ మీకు స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. ఇదంతా చదివాక మీకు ఏదో ఒక సేకరణ చేయాలనిపిస్తుంది కదూ.

ఇక ఆలస్యమెందుకు ఒక అంశం ఎన్నుకొని మీ సేకరణను ఈ రోజు నుంచే ప్రారంభించండి.
– టి. శాంతాభాస్కర్‌