సూక్ష్మపోషకాలు తప్పనిసరి

EATING
EATING

సూక్ష్మపోషకాలు తప్పనిసరి

పిల్లల్లోనూ కొంతవరకూ పెద్దల్లో కూడా సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా ఉండటానికి ప్రధానంగా మన ఆహారపుటలవాట్లే కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. మనమంతా కూడా ప్రధానంగా వరి, గోధుమ, జొన్న వంటి తృణధాన్యాల మీదే ఎక్కువగా ఆధారపడు తున్నాం. రోజువారీ ఆహారంలో వీటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాం.

మన శరీరానికి కావాల్సిన శక్తి అంతా కూడా వీటి నుంచే ఎక్కువగా లభిస్తోంది. నిజానికి ఇవి మనకు కావాల్సిన కీలక సూక్ష్మపోషకాలు మాత్రం అంతగా అందవు.వీటి ద్వారా రక్తం పట్టేందుకు అవసరమయ్యే ఇనుము, ఎముక పుష్టికి అవసరమైన కాల్షియం వంటివి లభించటం చాలా తక్కువ. చివరికి మన రోజు వారీ ఆహారం ఎలా ఉండాలన్న దానిపై భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సిఫార్సుల్లో కూడా తృణధాన్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు గానీ ఎక్కడా మాంసం, చేపలు, తాజాపండ్లు, ఎండుపండ్లు, ఆకుకూరలు, గింజధాన్యాలు వంటి వాటి ప్రస్తావన లేదు.

రోజూ కేవలం వరి అన్నం, గోధుమ రొట్టెలు వంటివే ఎక్కువగా తినిపించటం కాకుండా, వీటితో పాటు వైవిధ్యభరితంగా ఉండే రకరకాల ఆహారాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించేందుకు వారి రోజువారీ ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, గుడ్లు, మాంసం, జీడి, బాదం, వేరుశనగవంటి పప్పులు, నూనెగింజలు, ఇవన్నీ ఉండేలా చూడటం చాలా అవసరం. ఇవి దీర్ఘకాలంలో బిడ్డ మానసికంగానూ, శారీరకం గానూ కూడా చక్కగా ఉండేలా దోహదపడతాయి.

సూక్ష్మపోషకాల లోపాన్ని కొంతవరకూ తక్షణం, తాత్కాలికంగా అధిగమించేందుకు మార్కెట్లో పాలల్లో కలిపి ఇచ్చేందుకు వీలుగా లభ్య మవ్ఞతున్న విటమిన్లు, పోషకాలుండే హార్లిక్స్‌, బూస్ట్‌ వంటి వాటిని ఆశ్రయించవచ్చు. దీర్ఘకాలంలో మాత్రం సమతులమైన, వైవిధ్య భరితమైన ఆహారాన్ని అందించటమే దీనికి సరైన పరిష్కారం.