సీమాంధ్ర ఓటు చుట్టూ రాజకీయం

VOTER
VOTER

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్‌ 7 జరుగనున్న ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం సీమాంధ్ర ఓటర్ల చుట్టూ సాగున్నది. మహా లేదా ప్రజా కూటమిలో తెలుగు దేశం పార్టీ భాగస్వామిగా నిలుస్తుందని వెల్లడైన నాటి నుంచి అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ తన లక్ష్యాన్ని మార్చింది. తెలుగు దేశం పార్టీ ఒకటి ఆర శాతం ఓట్ల శాతం ఓట్లతో తెలంగాణలో అతి బలహీనంగా ఉందని ముందుగా భావించినప్పటికీ మారుతున్న పరిస్థితులకనుగుణంగా టిఆర్‌ఎస్‌ తన బాణాన్ని కూటమి పక్షాలపై నేరుగా ఎక్కుపెడుతోంది. తెలంగాణలో కేవలం కాంగ్రెస్‌ పార్టీని తన ప్రధాన ప్రత్యర్థిగా టిఆర్‌ఎస్‌ పేర్కొంటూ వస్తున్నప్పటికీ కూటమి ఏర్పాటుతో పంథాను మార్చుకోక తప్పడం లేదు. పైగా టిఆర్‌ఎస్‌ ముందున్న పరిస్థితి కొంత గందరగోళంగా కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు, వారితో లింక్‌ అయిన సీమాధ్ర ఓటర్ల మనోభావాలు… ఈ మూడింటిని బేరీజు వేసుకొని సరైన మార్గంలో విమర్శలను ఎక్కుపెట్టనట్లయితే సమస్యలను కూడా పసిగట్టడంతో మధ్యేమార్గాన్ని ఎంచుకోకతప్పని పరిస్థితి టిఆర్‌ఎస్‌కు ఏర్పడుతున్నది. ఇందులో భాగంగానే మంత్రులు కెటి రామారావు, హరీష్‌ రావుల ప్రసంగాల్లో తేడా వెల్లడవుతున్నది. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్ల ప్రభావం రాష్ట్ర అసెంబ్లీలోని 119 సీట్లలో నాలుగో వంతు నియోజక వర్గాల్లో అధికంగా ఉంటుందనేది బహిరంగ రహస్యమే. అందుకే ఈ సెటిలర్ల ఓట్ల కోసం టిఆర్‌ఎస్‌ నేతల వైఖరిలో మార్పు వస్తున్నది. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ, తమ పార్టీ అగ్ర నేతల విమర్శలు ఆయన వైఖరి పట్లనే అని సీమాంధ్ర ఓటర్లపై కాదరని వివరణ ఇచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికంగా ప్రస్తావనకు వస్తున్నది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికీ అధికార టిఆర్‌ఎస్‌తోపాటు మహా కూటమి కూడా ప్రచారం సందర్భంగా చంద్రబాబు పేరులేకుండా వారి ప్రసంగాలు ఉండటం లేదు.
తెలంగాణలో తిరుగులేని పార్టీగా టిఆర్‌ఎస్‌ ఉందని,అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో నాయకత్వం సమస్య, సమన్వయ లోపం వల్ల ఆ పార్టీ తమకు పెద్దగా పోటీ ఇవ్వదని అందుకే 100 సీట్లకు తక్కువ కాకుండా టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందనే విశ్వాసంతో టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు విజయావకాశాలపై అధిక దీమా వ్యక్తం చేశారు. ఇదంతా తెలంగాణలో మహా లేదా ప్రజా కూటమి ప్రయత్నాలు ప్రారంభం కాకముందు టిఆర్‌ఎస్‌లో ఉన్న విశ్వాసం. కూటమి ఏర్పడే అవకాశాలు తక్కువని,వారి మధ్య సీట్ల తకరారు తేలదని, తేలినా అసంతృప్తి వల్ల నాలుగు పార్టీలకు చెందిన వారు కూడా ఇండిపెండెంట్లుగానో లేక ఇతరత్రా ఆయా పార్టీలకు ఇబ్బందులు సృష్టిస్తారని కూడా టిఆర్‌ఎస్‌ నమ్మకంగా ఉంది. ఇందులో భాగంగానే టిజెఎస్‌ పార్టీని ఎద్దేవ చేస్తే ముష్టి మూడు సీట్లకోసం పొత్తులు పెట్టుకుంటున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను మంత్రి కేటిఆర్‌ తూర్పారపట్టారు. పైగా కాంగ్రెస్‌లో డజన్‌ మంది నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులని ప్రచారం చేసుకుంటున్నారని, దీంతో వారి మధ్య గొడవలు తప్పవని కూడా టిఆర్‌ఎస్‌ నేతల ఊహించారు. కాగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అసలు ఉనికి లేదనే విధంగా వారు ప్రస్తావిస్తూ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని ఇప్పటికీ వారు తమతమ ప్రచారంలో ఈ సంఖ్యను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగాటిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలుచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలోఉన్న చంద్రబాబుపై టిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు తెలంగాణలోఉన్నసెటిలర్లలో ఆలోచనలు పెంచాయనే ప్రచారం జరిగింది. అందుకే తెలంగాణలోఉన్నసెటిలర్ల సమస్యలు ఏమి ఉన్నా,తాను వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో స్వయంగా కెటిఆర్‌ హామీ ఇచ్చి, వారిలో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆది, సోమవారాల్లో జరిగిన పలు ఎన్నికల బహిరంగ సభల్లోనూ అటు కెటిఆర్‌, ఇటు హరీష్‌ రావు కూడా సెటిలర్ల విషయంలో కొంత అప్రమత్తంగా మాట్లాడటం గమనార్హం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంతోపాటు తెలంగాణ సాధించుకున్న తర్వాత వెంటనే జరిగన 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తన అప్పటి మిత్రపక్షమైన బిజెపితో కలిపి మంచి సంఖ్యలోనే అసెంబ్లీ సీట్లు సాధించుకోవడం గత చరిత్రగా చెబుతున్నా, డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లోనూ టిడిపికి ఇదే స్థాయిలోబలం పెరుగుతుందనే అంచనాలే ప్రజా కూటమిలో ఆశలు పెంచుతున్నాయి. దాదాపు 28 నుంచి 30 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సెటిలర్ల సంఖ్య అధికంగానే ఉండటంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయమే కీలక చర్చనీయాంశమవుతున్నది. కాగా ఈ సెటిలర్లలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్ల అభిప్రాయం ఇతర ఓటర్ల అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయని దీంతో టిఆర్‌ఎస్‌కు ఒక వర్గం ఓట్లు తప్పనిసరిగా అధికంగా పడుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అభిమానించే వారు మరో విధమైన నిర్ణయం తీసుకొని కూటమికి అండగా ఉంటారని అంటున్నారు. అందుకే కొద్ది రోజులుగా సెటిలర్ల ఓట్లపై అందరి దృష్టి పెరిగింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును సమర్థిస్తూ, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను ఎవరూ విస్మరించలేరని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో దాదాపు ముఖాముఖి పోటీగా పరిస్థితి మారుతుండటంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. టిఆర్‌ఎస్‌ నేతల భాషను కాంగ్రెస్‌ నేతలు కూడా అదే భాషతో తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో పరిస్థితి కొంత అధ్వాన్నంగా తయారవుతున్నది. టిఆర్‌ఎస్‌-ఎంఐఎం ఒక కూటమిగా ఏర్పడగా, కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌లు మరో కూటమిగా త్వరలో ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ రెండు కూటముల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండబోతున్నది. కాగా బిజెపితోపాటు సిపిఎం నేతృత్వంలోని మరో కూటమి కూడా బరిలో ఉంటున్నా వాటి బలం అంతగా లేకపోవడతో రాష్ట్రలో ముఖాముఖి పోటిగా ఈ ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్‌తోపాటు టిడిపిని టార్గెట్‌ చేస్తున్నది. టిడిపితో జత కట్టడం ద్వారా తెలంగాణ ద్రోహానికి కాంగ్రెస్‌ పాల్పడుతున్నదనే స్థాయిలో టిఆర్‌ఎస్‌ ధ్వజమెత్తుతుండగా గతంలో టిఆర్‌ఎస్‌ కూడా టిడిపితో అంటకాగిన విషయాన్ని కాంగ్రెస్‌ ఎత్తిచూపుతున్నది. తమ కూటమి లక్ష్యం టిఆర్‌ఎస్‌ దుష్టపాలన అంతానికి, కుటుంబ పాలన అంతానికి, అవినీతి పాలన అంతానికి.. అంటూ మరింత వేడిగానే కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది.టిడిపి తెలంగాణ నేతలతో పొత్తుపెట్టుకోవడాన్ని టిఆర్‌ఎస్‌ ఆక్షేపించడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తూ, తెలంగాణ ప్రయోజనాలను తాము టిఆర్‌ఎస్‌ కంటే అధికంగా పరిరక్షించగలమని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కీలక హామీలను నెరవేర్చని టిఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలనే విధంగా కాంగ్రెస్‌ నేతలు కొంత వేడి భాషను వినియోగంచడం చర్చనీయాంశమవుతున్నది. అయితే టిఆర్‌ఎస్‌ నేతలు కూడా ఏమి తక్కువకాకుండా కాంగ్రెస్‌, టిడిపిలపైన తీవ్రంగానే మండిపడుతున్నందున దొందు,దొందే అన్నట్లుగా పరిస్థితి మారింది.