సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ నగర బహిష్కరణ

MAHENDER REDDY, DGP
MAHENDER REDDY, DGP

ఆరు నెలల పాటు హైదరాబాద్‌ రావద్దని ఆదేశం….చిత్తూరు పోలీసులకు అప్పగింత
అవసరమైతే మహేష్‌ను రాష్ట్ర బహిష్కరణ చేస్తాం…మహేష్‌ విమర్శలు ప్రసారం చేసిన టివి ఛానల్‌కు తాఖీదు
శాంతి భద్రతల పరిరక్షణకు మీడియాతో పాటు అన్ని వర్గాలు సహకరించాలి…డిజిపి మహేందర్‌ రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌: పురాణ పురుషుడు శ్రీరాముడితో పాటు సీతాదేవిపైనా, రాయాయణంపైనా అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మ హేష్‌పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు. మహేష్‌పై బహిష్కరణ తరువాత టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని స్వస్థలం చిత్తూరు కు తరలించి అక్కడి పోలీసులకు అప్పగించారు. మహేష్‌ విమర్శలను అదేపనిగా ప్రసారం చేసిన ఓ టివి ఛానల్‌కు పోలీసులు తాఖీదులు జారీ చేశారు. కాగా బహిష్కరణ సమయంలో మహేష్‌ హైదరాబాద్‌కు వస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందని అవసరమైతే అతనిపై రాష్ట్ర బహిష్కరణ విధిస్తామని డిజిపి మహేందర్‌ రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మీడియాతో పాటు అన్ని వర్గాలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
సినీ విమర్శకుడుగా వుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలతో కొంత కాలంగా టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్న కత్తి మహేష్‌ ఉన్నట్లుండి హిందువులకు పవిత్రంగా వున్న పలు గ్రంథాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే సమయంలో నాలుగు రోజుల క్రితం పురాణ పురుషుడు శ్రీరాముడు, సీతాదేవిలపై అనుచిత వ్యాఖ్య లు చేయడంతో హిందూ ధర్మ పరిరక్షణ సమితితో పాటు పలు ధార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు మండి పడడం విదితమే. ఇదే విషయమై స్వామి స్వరూపానంద సోమవారం ఉదయం ఉప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు శాంతి యాత్ర చేబట్టేందుకు సిద్దమవడంతో పోలీసులు రంగంలో దిగి దిద్దుబాటు చర్యలు చేబట్టారు. ఈ వి షయమై ఆదివారం డిజిపి మహేందర్‌ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశమై కత్తి మహేష్‌ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించి చివరకు అ తనిపై తడీపార్‌ (సిటీ బహిష్కరణ) విధించాలని నిర్ణయించారు. ఇదే అంశంపై డిజిపి మహేందర్‌ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వున్నాయని, ఈ నేపథ్యంలోనే అతనిపై ఐపిసి 295 (ఎ), 505 (2) సెక్షన్ల కింద ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించామని తెలిపారు. బహిష్కరణ సమయంలో అతను హైదరాబాద్‌కు వచ్చినా, వచ్చేందుకు యత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ విధిస్తామని డిజిపి తెలిపారు. ఇదే సమయంలో అతన్ని మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు లేవని, శాంతి భద్రతలు సవ్యంగా వున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుండడంతో సగటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆ యన తెలిపారు. ఇటువంటి సమయంలో కత్తి మహేష్‌ లాంటి వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము కఠినంగానే వ్యవహరిస్తామని తెలిపారు. మహేష్‌ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని, అతనిపై మూడు కేసులున్నాయని, ఈ నేపథ్యంలోనే అతనిపై తడిపార్‌ విధించడంతో పాటు అతను చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన ఛానల్‌కు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు. ఈ నోటీసులకు ఛానల్‌ యాజమాన్యం ఇచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు వుంటాయని డిజిపి తెలిపారు. ఇదే సమయంలో స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన శాంతి యాత్రకు కూడా అనుమతి ఇవ్వడం లేదని డిజిపి తెలిపారు.
మీడియా సంయమనం పాటించాలి….ఛానళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు
కాగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు చేస్తున్న కృషికి అన్ని వర్గాల వారు సహకారం అందించాలని డిజిపి మహేందర్‌ రెడ్డి కోరారు. ము ఖ్యంగా మీడియా సంస్థలు వార్తలు, ఇతర కథనాల ప్రసారం విషయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు. భావ స్వేచ్చ, భావ వ్యక్తీకరణ పేరిట ఇతరుల ను కించపరిచే విధంగా మీడియాతో పాటు ఎలక్ట్రానిక్‌ ఛానళ్లు ఇష్టారాజ్యంగా వార్తలు, ఇతర కథనాలు ప్రసారం చేస్తే ఇకముందు కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి హెచ్చరించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే కథనాలు, మత సామరస్యం దెబ్బతీసే విధంగా వుండే వార్తలు, ఒక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ కొందరు వ్యక్తులు చేసే వ్యా ఖ్యలను మీడియా ప్రసారం చేయడం సరికాదని ఆయన అన్నారు. దీనివల్ల ప్రశాంతంగా వున్న సమాజంలో అనవసర గొడవలు చెలరేగే ప్రమాదం వుందని ఆయన తెలిపారు. ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలు, పోలీసు కమిషనరేట్లలోని కొత్వాళ్లు ఈ తరహా వార్తలు, కథనాల విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ ఈ విషయంలో ఆయా ప్రాంతాల పోలీసులు విఫలమైతే వారిపైనా చర్యలు వుంటాయని డిజిపి హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌, శాంతి భద్రతల చీఫ్‌ జితేందర్‌, నిఘా విభాగం అధినతి నవీన్‌చంద్‌, డిఐజి ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.