సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాయలేడిల అరెస్ట్

హైదరాబాద్: రైలు ప్రయాణీకుల లగేజీ నుంచి బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న మహిళను రైలులో గంజాయి రవాణా చేస్తున్న మరో మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వారి నుండి 9 తులాల బంగారు ఆభరణాలు, 32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రైల్వే ఎస్సీ అశోక్ కుమార్ తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించారు. వైజాగ్‌కి చెందిన లక్ష్మీ గురువారం లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడింది. ఆమె నుండి 32కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో నిజామాబాద్‌కి చెందిన అనిత(32) రైలులో ప్రయాణం చేస్తూ అదును చూసి ప్రయాణీకుల లగేజి నుంచి చాకచక్యంగా జిప్ ఓపెన్ చేసి బంగారు ఆభరణాలు తస్కరించింది. ప్రయాణీకుల నుండి ఈ మేరకు ఫిర్యాదు అందడంతో డిజి విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సీ అశోక్ కుమార్, ఆర్పీఎఫ్, ఏఆర్, జీఆర్పీ విభాగాల్లో ఆరితేరిన పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేయగా అనిత అనే మహిళ పట్టుబడింది. పలు రైళ్లలో జనరల్ బోగీల్లో ప్రయాణీస్తూ అదును చూసి మహిళల భుజానికి వేలాడుతోన్న హ్యాండ్ బ్యాగుల్లో నుంచి ఏమాత్రం అలికిడి లేకుండా చాకచక్యంగా బ్యాగ్‌కు ఉన్న జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న విలువైన ఆభరణాలు తస్కరించి సమీప రైల్వే స్టేషన్లో దిగి మాయమై పోయేది. డిఎస్పీ రాజేంద్రప్రసాద్, ఇన్స్పెక్టర చంద్రన్న, ఆర్పీఎఫ్ సిఐ రాజగోపాల్ రెడ్డి, వారి వారి బృందాలతో మహిళను అరెస్ట్ చేసి, ఆమె నేరాలకు తెరదించారు
ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలి
ప్రయాణీకులు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అడుగు పెట్టినప్పటి నుంచి గమ్యం చేరేదాకా అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఎస్పీ అశోక్ కమార్ హెచ్చరించారు. లక్షలాది మంది ప్రయాణీకులల్లో కొందరు ప్రయాణీకుల మాదిరిగానే దొంగలు కూడా సంచరిస్తుంటారని, ముఖ పరిచయం లేని వ్యక్తులకు తమ లగేజీ అప్పగించరాదని, ప్రయాణంలో రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.