సిఎం కెసిఆర్‌ కళ్లజోడు మిస్సింగ్‌

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలో మూడు రోజులుగా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కళ్లజోడు మంగళ వారం మాయమైంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు నానా హైరానా పడ్డారు. చివరకు బుధవారం కళ్లజోడు దొరకడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, మంగళవారం రాత్రి నక్కలగుట్టలోని నందనా గార్డెన్స్‌లో కెసిఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం కేప్టెన్‌ లక్ష్మీకాంత రావు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి తన కళ్లద్దాల కోసం వాకబు చేశారు. భద్రతా అధికారులు ఆరా తీస్తే నందనా గార్డెన్‌లోనే వదలి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అధికారులు నందనా గార్డెన్‌లోని చెత్తడబ్బాలను వెతికారు. రాత్రి 11-30 వరకు వెదికినా ఫలితంలేదు. అయితే సహజంగా సీట్లోంచి సిఎం లేవగానే అక్కడున్న నాప్‌ కిన్‌లు, ఇతర వస్తువులను సెక్యూరిటీ సిబ్బంది లేదా అటెండర్‌తీసుకెళతారు. వాటిలో న్యాప్‌ కిన్‌లు, ఇతర వస్తువులు తీసుకెళ్లినా కళ్లద్దాలు వదిలి వేయడం ఏంటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మంగళవారం మాయమైన సిఎం కళ్లజోడు బుధవారం సాయంత్రం దొరికినట్లు అధికారులు చెపుతున్నారు.