సాహిత్య పీఠo పై కన్నీటి కెరటాల ‘విముక్త’

Screen Shot 2015-12-25 at 11.44.07 am

జాలువారే కన్నీటి కెరటాలకు విలువనిచ్చేవారు ఎవరు? స్త్రీ అంటే బానిస, స్త్రీకి స్త్రీయే శత్రువు అని నిందించేవారు, వారుమాత్రం ఏం ఉద్దరిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు గడియారం ముల్లుతో పోటీపడుతూ పరుగులు తీస్తుంటుంది మహిళ. గడియారం ముల్లుకు సెల్‌ వీక్‌గా ఉంటే దాని స్పందన ఉండదు. క్రమంగా టైమ్‌ ఆగిపోతుంది. కానీ గృహణికి ఒంట్లో శక్తి ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా ఓపిక తెచ్చుకుని ఇంటిపని చేయాల్సిందే. మబ్బులో సూర్యుడి దాగిపోయి కాసేపు సేద తీరతాడు, వీచేగాలికి అటూ ఇటూ ఊగిసలాడే చెట్టుఆకులు గాలి బలహీనమైన వెంటనే నిశ్శబ్దంగా ఆగిపోయి, నిద్రిస్తాయి, ఎగసిపడే కెరటాలు సముద్రం నిమ్మలించగానే కెరటమైనా క్షణకాలం నిశ్చలంగా నిలిచిపోతాయి కానీ స్త్రీకి మాత్రం క్షణకాలం కనురెప్ప మూస్తే పనులన్నీ మూటగట్టుకుని కలల రూపంలో కలవరపెడుతుంటాయి. అలసిన మనసు నిమిషమైనా కునుకుతీయరాదా అని వేడుకుంటున్నా పనులన్ని వరదలై ఆమెను తడిపేస్తూ, నిద్రను లేపుతాయి. ఆడది అంటే ఒక వస్తువు, ఆమెకు మనసు ఉంది, ఆ మనసుకు కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయని గుర్తించేవారు కొద్దిమందేకదా! ఆడపిల్లకు పుట్టినప్పటి నుంచే వివక్ష అనే భావంతోనే పెంచుతారు. వీటన్నింటిని చూసిచూసి, విసిగి, వేశారిన ఎందరో మహిళలు ఉన్నా ఏమీ చేయలేని ఒక నిస్సహాయత ఉంటుంది. కానీ కొందరు మాత్రం అలాంటి నిస్సహాయతలో ఒక చైతన్యభావాన్ని మొండిగా, పట్టుదలతో మనసుపై నాటుకుంటారు. అదే భావంతో ఏదో ఒకటి చేయాలనే తపన వారిలో ఆరంభం అవుతుంది. తద్వారా వారికున్న ఆసక్తి, అభిరుచుల్లోనే ఒక ఆయుధాన్ని చేసుకుని, దానితో పోరాడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో ఓల్గా ఒకరుగా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎం.ఎ. చదివిన ఓల్గా తనచుట్టూ జరుగుతున్న అన్యాయాలను సహించలేక రచనపై ఉన్న అభిమానం, అభిరుచినే కలం పోరుకు ఉద్యమించారు. అలా మొదలైన ఆమె రచనా పరంపరలు ‘విముక్త’ నవల వరకు వచ్చారు. ఇప్పుడు ఆ నవలే ఆమెకు జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపును ఇచ్చింది. ఆ నవలే కేంద్ర సాహిత్య అవార్డుకు ఎంపికైంది.

ఓల్గాకు పరిచయవాక్యాలు అవసరం లేదు. ఆమె పేరు వింటే స్త్రీవాది అనే వెటకారం పురుషుల్లో ఉదయించినా, ఆ రచనలే అనేకుల హృదయాల్లో మానవీయభావాల్ని రగిల్చి, స్త్రీలను చైతన్యదిశల్లో నడిపించేందుకు కారణమవుతున్నాయి. అందుకే ఆమె రచనాశక్తి గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆమె ఇటీవల రాసిన విముక్త నవలకు 2015 సంవత్సరానికిగను సాహిత్య అకాడమీ పురస్కారంతో సత్కరించింది. స్త్రీవాదంలో తనదైన ముద్ర వేసిన ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి.

పుట్టుపూర్వోత్తరాలు : 1950లో నవంబరు 27న గుంటూరు జిల్లాలో జన్మించిన ఓల్గా ఆంధ్రావర్సిటీలో ఎం.ఎ. తెలుగు చదివారు. ఆ తర్వాత తెనాలి వి.ఎస్‌.ఆర్‌. అండ్‌ ఎన్‌.వి.ఆర్‌. కళాశాలలో 1973 నుంచి 1986 వరకు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో ఆమె అడ్వైజర్‌ మెంబర్‌గా పనిచేశారు.1986 నుంచి 1995 వరకు ఓ సినిమా సంస్థలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఓల్గా పలు కథలు, నవలలు రాశారు. ఆ తర్వాత మహిళల కోసం అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ను ఆరంభించారు. దానికి అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం అస్మిత నిర్వహణ బాధ్యుల్లో ఒకరుగా పనిచేస్తున్నారు.

ప్రాచుర్యం పొందిన నవలలు : ఓల్గా 1986లో సహజ తొలి నవలను రాశారు. ఆ తర్వాత గులాబీ (2000), ఆకాశంలో సగం, మానవి (1998), స్వేచ్ఛ (1994), కన్నీటి కెరటాల వెన్నెల (1999), ‘సహజ (1995) వంటి నవలు రాశారు.

చిన్నకథలు : ఓల్గా పలు కథలను కూడా రాశారు. రాజకీయ కథలు (1993), ప్రయోగం (1995), విముక్త (ప్రస్తుతం అవార్డు పొందిన కథ) (2015) వంటివి ఉన్నాయి.

అనువాదపు కథలు : ఓల్గా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించిన కథలు కూడా రాశారు. డాటర్‌ ఆఫ్‌ ఎర్త్‌ (1985), లెటర్‌ టు ఏ చైల్డ్‌ నెవర్‌ బర్న్‌ (1990), ఎరియల్‌ డాఫ్‌మెన్స్‌ విడోస్‌ (1994) వంటివి ఉన్నాయి.

ఇవన్నీ విశేష ప్రాచుర్యాన్ని పొందడమే కాకుండా, ఓల్గాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వాత ఓల్గా సంపాదకత్వంలో వెలువడిన నీలి మేఘాలు కవితా సంకలనం స్త్రీవాద కవిత్వానికి గీటురాయిగా నిలిచింది.

సినీరంగంలో ప్రవేశం : ఓల్గా తెలుగు సినిమాలకు కథారచయితగా కూడా పనిచేశారు. భద్రం కొడుకో అనే సినిమాకు కథారచయితగా ఉన్నారు. ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు ఉత్తమ బాలల చిత్రంగా నంది అవార్డును కూడా పొందింది.

విముక్త కథ సారాంశం : కేంద్ర సాహిత్య అవార్డును పొందిన ఓల్గా రచించిన విముక్త నవలలో స్త్రీలు తమ మీద తాము అధికారాన్ని సంపాదించుకోవాలి, అస్తిత్వాన్ని అన్వేషించుకోవాలి, స్త్రీలు పరస్పరం సహకరించుకోవాలని మహిళల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించే ఇలాంటి సంఘటనలు ఈ నవల నిండా కనిపిస్తాయి. ఇందులో సీతది ప్రధానపాత్రగా కనిపిస్తుంది. సీత చుట్టూ శూర్పణక, అహల్య, రేణుక, ఊర్మిళ పాత్రలు తిరుగుతూ, ఆమె వీరి నుంచి ఎలా బయటపడ్డారో వివరిస్తుంది.

ఫెమినిజం భావాలతోనే రచనలు : ఓల్గా రచనల్లో ప్రధానంగా స్త్రీ ప్రధానంగా ఎదుర్కొంటున్న వివక్షపైనే గురిపెట్టారు. అన్నిరంగాల్లో మహిళలు అనుభవిస్తున్న వివక్షపై కలంతో పోరాడుతున్నారు. దీంతో ఆమెకు తక్కువకాలంలోనే స్త్రీవాద ఫెమినిస్ట్‌ రచయిత్రిగా పాపులర్‌ అయ్యారు. స్త్రీవాద భావంతో మాకు గోడలు లేవు అనే రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఓల్గా వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రైట్స్‌, లిటరేచర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఓల్గాపై చలం, కొడవగంటి కుటుంబరావు ప్రభావం ఉందని చెప్పొచ్చు. వీరిద్దరు స్త్రీవాదాన్ని బలపరుస్తూ పలు రచనలు చేశారు.

పత్రికారంగానికి సుపరిచితులు : ఓల్గాకు ఎక్కువగా పేరు తెచ్చింది మాత్రం వార్తపత్రికలే అని చెప్పవచ్చు. స్త్రీ సమస్యలై ఆమె రాసిన పలు వ్యాసాలు వార్తాపత్రికల్లో ప్రచురితమవుతుంటాయి. అందుకే తెలుగు పాఠకులకు ఓల్గా అంటే బాగా తెలుసు.

అవార్డులు : ఓల్గా రాసిన రచనలకు పలు అవార్డులు లభించాయి.1990లో ఉదయం మ్యాగజైన్‌లో రాసిన ఆకాశంలో సగం అనే నవలకు ఉత్తమ నవలగా అవార్డు పొందింది. ఉత్తమ బాలల నంది అవార్డు, 1999లో ఉత్తమ తెలుగు రచయితగా తెలుగు యూనివర్సిటీ నుంచి, 1987లో స్వేచ్ఛ నవలకు ఉత్తమ నవలా అవార్డులను పొందాయి.

టి.వి. సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గా కూడా ఓల్గా పనిచేశారు.