సాక్ష్యాల సహా ఫిర్యాదు చేసినా చర్యలు లేవు

జగన్ అండతో వారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. చంద్రబాబు

అమరావతి: సిఎం జగన్‌ అండతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు టిడిపి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండా మంత్రి పెద్దిరెడ్డి భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలో అభివృద్ది పనులను పక్కన పెట్టిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేయడానికి ముందుకొచ్చిన అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఎన్నికలు సజావుగా జరిపించాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. పెద్దిరెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులపై సాక్ష్యాధారాల సహా ఫిర్యాదు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి పోలీసులు, ఎస్‌ఈసీ ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.