సల్మాన్‌ను వెంటాడుతున్న హిట్ అండ్ రన్

salman khan

బాంబే హైకోర్టు నిర్దోషి అని ప్రకటించినా.. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హిట్ అండ్ రన్ కేసు ఇంకా వెంటాడుతునే ఉంది. 2002 నాటి కేసులో సల్మాన్ మద్యం తాగి కారును నడిపించారనేందుకు సరైన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ ఈ నెల 10న బాంబే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొన్నది. గతంలో ట్రయల్ కోర్టు విధించిన ఐదేండ్ల శిక్షను కొట్టివేస్తూ జస్టిస్ ఏఆర్ జోషి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో ఎస్సెల్పీని దాఖలు చేయడానికి ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర న్యాయశాఖ అనుమతి ఇచ్చిందని జస్టిస్ అభయ్ ఓకా, గౌతమ్ పటేల్‌తో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వ ప్లీడర్ అభినందన్ వగ్యాని తెలిపారు.