సమగ్ర చట్టమే శరణ్యం!

                              సమగ్ర చట్టమే శరణ్యం!

FAKE BABA'S
FAKE BABA’S

నకిలీ బాబాల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. రకరకాల ఆశలు కల్పించి అమాయకులను మోసంచేయడం పరిపాటిగాజరుగుతున్నది. దీన్ని అరికట్టేందుకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కాపాడేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. గతవారంలో హైదరాబాద్‌లో ఒక నకిలీబాబా భాగోతం బైటపడింది. అప్పటికే ఆయన వందలాది మందిని మాయమాటలతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. చివరకు అత్యాచారం ఆరోపణలు కూడా పెల్లుబికాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పొరుగున ఉన్న ఆంధ్రప్రనదేశ్‌ ఛత్తీస్‌ఘర్‌ మధ్యప్రదేశ్‌ ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా ఈ బాబాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇందులో కొందరు బడాబాబాలకు కొందరు రాజకీయ నాయకులే అండ ఉండటంతో వారి అరాచకాలు పరాకాష్టకు చేరుతున్నాయి.

మూఢనమ్మకాలకు మరింత ప్రచారం కల్పించి నమ్మించి మోసానికి పాల్పడుతున్నారు. మానవుడు నిత్యజీవన పోరాటంలో ఏదో విధమైన మానసిక వత్తిడి ఎదుర్కొంటునాన్నడు. ఎండకు ఎండని వానకు తడవని మానవుడు ఎలా ఉండరో అదేవిధంగా కోరికలు లేని మనిషి లేడని చెప్పవచ్చు. కోరికలు పెరిగే కొద్దీ మనశ్శాంతి కరువవుతుందని చెప్పకతప్పదు. వారి వారి స్థాయిని బట్టి, అవసరాలను బట్టి, కోరికలు పెరుగుతూనే ఉంటాయి. రకరకాల సమస్యలు కోరికలతో వ్యధలతో మనశ్శాంతి కరువైన పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భక్తి ముఖ్యంగా స్వామీజీలు,బాబాలు ఉపన్యాసాలతో ప్రవచనాలతో తమతమ సమస్యలకు పరిష్కారం దొరికి కొంతైనా ప్రశాంతత లభిస్తుందన్న ఆశతో ఈ స్వామీజీలను బాబాలను ఆశ్రయిస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాహినిలో స్వామిల గురువల పాత్ర మహోన్నతమైనది.

ఎందరో స్వామీజీల చరిత్రచూసినా మనల్ని తరింపచేసేందుకు అవతరించిన మానవమూర్తులుగా సాక్షాత్కరిస్తారు. ఇలాంటి తులసి వనంలో గంజాయి మొక్కలు కూడా మొలకెత్తడం మన గ్రహచారం. స్వామీజీలను ఆశ్రయించి సమస్యను పరిష్కరించాలని తపనపడే వారి సంఖ్య పెరుగుతున్నది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు స్వార్ధపరులు బాబాలు స్వామీజీల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడమే కాక, చేయరాని చేయకూడని పనులు చేస్తున్నారు. అందరూ ఇలా చేస్తున్నారని చెప్పడంలేదు కానీ, అధికశాతం ఈ వైపే పయనిస్తున్నారేమోననిపిపిస్తున్నది. త్రికరణశుద్ధిగా దైవాన్ని నమ్ముతూ ఆధ్యాత్మికప్రసంగాలుచేసే స్వాములు బాబాలు ఉన్నారు. కానీ దీన్ని వ్యాపారంగా మార్చుకుని దురాశలో పడి మొత్తం వ్యవస్థపైనే ప్రభావం చూపేవిధంగా వ్యవహరించే నకిలీల బాబాలతో పరిస్థితి చేయిదాటిపోతున్నది.

ప్రజల బలహీనతనాడిని పట్టుకుని విశ్వాసం కలిగిస్తే చాలు అదే పెట్టుబడి. కనకవర్షం కురిపిస్తుంది. దీనికి విద్యార్హతలంటూ ఏమీలేవు. వయసుతో నిమిత్తంలేదు. చివరకు తమ పేరు తాము రాసుకోలేనివారు కూడా రాత్రికిరాత్రే కాషాయ వస్త్రాలు ధరించి తెల్లవారేసరికి స్వామీజీలు బాబాల అవతారం ఎత్తుతున్నారు. చిన్నపరిశ్రమ పెట్టాలన్నా, చిన్నదుకాణం పెట్టాలనుకున్నా ఎన్నో లైసెన్సులు మరెందరో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. దీనికి అలాంటి ఇబ్బందులేమీ లేవు. అనుమతులు కానీ లైసెన్సులె కానీ అవసరంలేదు. కాషాయ వేషధారణతో ఏవేవో చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. ఇలాంటి వారుచేసే కొన్ని వికృత చేష్టలు గ్రామీణ ప్రజల ప్రాణాలమీదికి తెస్తున్నాయి. తమ మంత్రాలతో శక్తులతో రోగాలు నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కడం, వాతలు పెట్టడం ఒకటేమిటి వారికి తోచిన ఆటవిక చర్యలన్నింటినీ చేస్తున్నారు.

ఇక మరికొందరు లీలలు కార్యకలాపాలు కూడబెట్టిన సంపద చూస్తుంటే ఆశ్చర్యం కలగక తప్పదు. అమ్మాయిల ఎగుమతులు గంజాయి కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల వ్యాపారం తదితరాలు బైటపడుతుంటే ఛీ వీరామనస్వాములు వీరికా ఇంతకాలం పూజలుచేసాం అని భక్తులే చీదరించుకుంటున్నారు. గతంలో దేశరాజధాని ఢిల్లీలో పేరొందిన ఒక స్వామీజీని ఆరుగురు యువతులతో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన అంతకుముందు 200 మందికిపైగా యువతులను విలాసవంతమైన హోటళ్లకు సరఫరాచేసారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఏళ్లతరబడి లక్షలాది మందికి ఆరాధ్యదైవంగా వెలుగొందిన డేరా సచ్చాసౌదా అధిపతి గుర్మీత్‌సింగ్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌ తెరవెనుక భాగోతం వెలువడిన తర్వాత విస్తుపోయే విషయాలు బైటకు వచ్చాయి.

ఆయన చేసిన వెకిలిచేష్టలన్నీ దైవస్వరూపుడిగా చేస్తున్నారని ప్రజలు నమ్మేవారు. ఒక్కొక్కటీ వెలుగుచూసిన తర్వాత ఆవేదనే కాదు అసహ్యం కూడా కలిగింది. ఆయన పెద్ద విద్యాధికుడు కాదు. ఆధ్యాత్మిక విషయంలో కూడా పెద్దగా ప్రవేశం ఉన్నట్లు కనిపించదు. వ్యవసాయం చేసుకుంటున్న ఆయన్ను సిర్సాలోని డేరా సచ్చాసౌదాధిపతి షా సత్నాసింగ్‌ డేరాకు తీసుకువచ్చి రామ్‌రహీంగా పేరుమార్చారు. ఆయన అక్కడ అంచలంచెలుగా ఎదిగి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. 2002లో మొదటిసారిగా ఆయనపై వివాదాలు చెలరేగాయి.

బలవంతపు అత్యాచారానికి బలైన ఒక బాలిక ఆనాటి ప్రధాన మంత్రికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయడంతో వారు సిబిఐ దర్యాప్తుచేయాలని ఆదేశించారు. దీనితో సిబిఐ రంగ ప్రవేశంచేసి మొత్తం వ్యవహారాన్ని బైటికి తీసింది. ప్రస్తుతం కటకటాలవెనక ఉన్నారు. ఇలా ఎందరో స్వామీజీలు బాబాలు అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. మూఢనమ్మకాలను పారద్రోలడంలో పాలకులు కూడా విఫలం అవుతున్నారు. పవిత్రమైన స్వామీజీల వ్యవస్థలో ఇలాంటి చీడపురుగులను ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమనుకుంటే చట్టాన్ని సవరించి అయినా ఈ నకిలీబాబాల,స్వామీజీల ఆటకట్టించాలి.
– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌