సభాసమావేశాల్లో సెల్‌ఫోన్‌ వాడకం అనుచితం..

విచక్షణ కలిగి ఉండాల్సిన అవశ్యం!

పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభ సమావేశాలలో వివిధ సమస్యలు వాదోపవాదాల మధ్య జరుగుతుంటాయి. చాలా ఆసక్తికరంగా, దీర్ఘంగా సాగుతున్న సమావేశాలలో నాయ కులు సెల్‌ఫోన్లు వాడుతూ, సమస్యలు పట్టక, దృష్టినంతా వాటిపైనే కేంద్రీకరించడం తగదు. అసలు సభ సమావేశాలలో సెల్‌ఫోన్‌ వాడకం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదు.

ఇది సభకు ఆమోదం కాదు. చాలా మంది నేతలు సెల్‌ఫోన్‌పైనే దృష్టి పెట్టడం, వారిలోనే వారు ఆనందించుకోవడం చూస్తు న్నదే. ఇటీవలే రాజ్యసభ సమావేశాలలో రాజ్యసభ ఛైర్మన్‌ నాయకులు సెల్‌ఫోన్లు వాడకూడదు, అది సభకు అంగీకారం కాదని వక్కాణించారు. గతంలో నాయకులకు సెల్‌ఫోన్లు ఉండేవి కాదు. అందరూ ల్యాండ్‌లైన్‌ ఫోన్లు ఉపయోగించే వారు. ఏవైనా అర్జెంట్‌ కాల్స్‌ వస్తే సభలోకి కిందిస్థాయి ఉద్యోగులు నాయకుల దగ్గరకు వెళ్లి చెప్పేవారు.

అంతేకాని ఇప్పుడు మాదిరి సెల్‌మోగుతూనే సభ కార్యక్రమాలు విస్మరించి వెళ్లేవారుకాదు. పైగా సభ జరుగుతుండగానే వాట్సాప్‌ చూస్తున్నారు. సభలో ఏమి జరుగుతుంది. ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అనే వాటిపై దృష్టి ఉండటం లేదు. సభాకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాయకులు కునుకు తీయడం చూస్తున్నదే.

కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నప్పుడు నాయకులు అమి తంగా బల్లలుచరుస్తూ పాలకపక్షం వారు చేసే హంగామా అంతా ఇంతాకాదు. అదే ప్రతిపక్షం వారు ఒక సమస్యపై ఏదైనా అంశాన్ని లేవనెత్తి, ఆ సమస్యకు స్పష్టమైన జవాబు రాకపోతే స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లి నానా యాగీ చేసిన సందర్భాలు అనేకం.

ఇక్కడ సభ పార్లమెంటా! రాష్ట్రాల శాసనసభలా అనేది ముఖ్యం కాదు. ఏ సభ అయినా సంప్ర దాయం, క్రమశిక్షణ, గౌరవం, హుందాతనంతో జరగాలి. గతంలో నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో సభ కార్యక్రమాలు ఎంతో హుందాగా జరిగేవి. నాయకుల మధ్య సంభాషణలు చాలా వాడి,వేడిగా ఉండి చమత్కారంగా ఉండేవి.దీనితో సభలో నవ్ఞ్వలు, పువ్వులు పూసేవి.

అలాగే రాష్ట్రాల శాసన సభలు కూడా నవ్వులు,పువ్వులు, విసిరిన సందర్భాలు కోకొల్లలు.ఇప్పటి మాదిరి అప్పుడు సెల్‌ఫోన్‌ వాడకంలేదు.సభ జరుగుతున్నంత సేపు ఎక్కడికి కదిలేవారు కాదు. ఎప్పుడైతే సెల్‌ వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయో అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ ఉండటం పరిపాటి అయింది. మంచిదే కాని సెల్‌ ఎప్పుడు ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగించకూడదు అనే విచక్షణ ఉండాలి.

అందు నిమిత్తమే రాజ్యసభ అధ్యక్షుడు సెల్‌ ఫోన్‌ వాడకూడదు అని ప్రకటన చేసి ఉండవచ్చు. రాజ్యసభ అధ్యక్షుడు చేసిన ప్రకటన సహేతుకం.

ఆమోదదాయకం. కనుక పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభల సమావేశాలలో ఎవరు సెల్‌ ఫోన్లు వాడకూడదు అని నిబంధనలు కఠినతరం చేయడం, సభకు విలువఇచ్చిన వారమవుతాం. నాయకులు కూడా హుందా గా ప్రవర్తిస్తే నాయకులను చూసైనా పౌరులు కనీసం కొంచెంలో కొంచెమైనా మారుతారు అనడంలో సందేహం లేదు.

  • కనుమ ఎల్లారెడ్డి