సబ్సిడీలపై కోత .. పేద ప్రజలకు వాత

Ration Shop
Ration Shop (File)

సబ్సిడీలపై కోత.. పేద ప్రజలకు వాత

సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ భారత ప్రజలందరి వికాసమే నా లక్ష్యం అని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటిం చారు.అధికారంలోనికి వచ్చిన ఈ మూడు సంవత్సరా లలో అనేక వాగ్దానాలు, పథకాలు హామీల ప్రచార్భా టానికేనన్న విషయం తేటతెల్లమవుతుంది. మన్‌కీబాత్‌ మోడీ మనసులోని మాట పేదల నోట్లో మన్నుకొట్టేందుకేనన్న విషయం స్పష్టమవుతుంది.పాలనలో పారదర్శకత పాటించకుండా చాపకింద నీరులా పేదలకు అందిస్తున్న వివిధ సబ్సిడీల కత్తిరింపులకు పూను కుంది. ఆహార భద్రతా చట్టం కింద పేదలకు అందించే నిత్యావసర సరు కుల సరఫరాను ఒకటి తర్వాత ఒకటి నిలుపు చేస్తున్నారు. మే నెల నుండి చక్కెర సరఫరాను బంద్‌ చేశారు.

గత ఏడాది పెట్రోల్‌పై ఇచ్చే రాయితీలు రూ.27317 కోట్ల నుండి రూ. 25వేల కోట్ల వరకు తగ్గించారు. తాజాగా ఎల్‌పిజి సిలెండర్లపై ఉన్న సబ్సిడీని ప్రతినెల రూ.నాలుగు చొప్పున పెంచుతూ వచ్చే ఏడాది వరకు లేదా ప్రభుత్వం ఇచ్చేసబ్సిడీ సున్నా అయ్యేంతవరకు పెంచాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పూర్తిగా అప్రజా స్వామ్యం. అన్యాయం. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ డీజిల్‌ క్రూడ్‌ధరలు బ్యారెల్‌కు 48డాలర్లకు పడిపోయింది. వాటి ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం చేశారు.

అయినా భారతదేశంలో వివిధ రకాల పన్నులు వేసి అధికభారాన్ని ప్రజలపై మోపుతున్నారు. ఆహార భద్రత చట్టం 2013 కింద పేదలకు రూ. రెండుకు కిలో గోధుమలు, మూడు రూపాయలకే కిలో బియ్యం, ఒక్క రూపాయికి కిలో ముడి ధాన్యం( రాగులు, సజ్జలు, జొన్నలు వగైరా) సరఫరా చేయాలని ఆనాటి యుపిఏ ప్రభుత్వం నిర్ణయించి పౌర సరఫరా సంస్థ ద్వారా నిత్యావసర వస్తువ్ఞలైన గోధుమలు, బియ్యం,చక్కెర, గ్యాస్‌నూనె,మంచినూనె, పప్పులు, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు, పసుపు, ఎల్లిగడ్డలు, సబ్బులు వగైరా 14 రకాల వస్తువ్ఞలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పీడిఎస్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఒకటి తర్వాత ఒకటి తగ్గిస్తూ వస్తున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత భారంపడటంతో సరఫరాలను నిలిపివేస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నడుపుతున్న మధ్యాహ్న భోజన పథకం,ఐసిడిఎస్‌ తదితర స్కీంలు కూడా నిర్వీర్యం అయ్యే దుస్థితి ఏర్పడనున్నది. ప్రపంచ వ్యాప్తంగా వంటకోసం బొగ్గు,కట్టెలు, పిడకలు 43శాతంవాడుతుండగా భారత్‌ లో 50 శాతం కుటుంబాలు వీటిపైనే ఆధారపడి ఉన్నాయని లెక్క లు చెపుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లబ్ధిచేకూర్చేలా ఐదుకోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్స్‌ ఇస్తా మని, 80శాతం జనాభాను గ్యాస్‌ వినియోగపరిధిలోనికి తీసుకొస్తా మని వాగ్దానం చేసిన ప్రభుత్వం వాస్తవానికి ఈ మూడు సంవత్స రాల కాలంలో 18 లక్షలు మాత్రమే ఇచ్చారు. మరోవైపు ఆదాయ వర్గాలు వంటగ్యాస్‌రాయితీని వదులుకోవాలని మోడీ పిలు పునిచ్చారు. దీనికి ‘లీవ్‌ఇట్‌ ఆఫ్‌అని ముద్దుపేరు పెట్టారు.

రాయితీ లు వదులుకున్న వారు మరొక పేదవాడికి సబ్సిడీని ఇచ్చినట్టేనని నమ్మబలికారు. దీనివలన రూ.5వేలకోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రక టించారు.ఆ తర్వాత 10 లక్షల ఆదాయంఉన్నవారు సబ్సిడీగ్యాస్‌ వదులుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు మొత్తం సబ్సిడీనే ఎత్తివే శారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే సబ్సిడీ గ్యాస్‌కు మంగళం పాడినట్లు అర్థమవ్ఞతుంది. దేశంలో వ్యాపార సిలిండర్లకు సబ్సిడీ లేదు. ప్రస్తుతం దేశవ్యా ప్తంగా 24 కోట్ల ఇళ్లు ఉంటే 14కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్స్‌ ఉన్నా యి. గ్రామాలు, కొండ ప్రాంతాల్లోని 10 కోట్ల ఇళ్లల్లో ఇంకా వంట చెరుకు,పేడతో చేసిన పిడకలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడు తున్నారు. మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఉజ్వల పేరిట గ్యాస్‌ కనెక్షన్ల జారీని పెద్దఎత్తున ప్రారంభించారు.

ఈ పథకంలో 1.60 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్స్‌అందించామని చెపుతున్నారు. అంతకుముందు కొన్ని రాష్ట్రాలలో దీపం వంటి పథకాల ద్వారా మహిళలకు ఉచితంగానే గ్యాస్‌ కనెక్షన్స్‌ ఇచ్చారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 19 మిలియన్‌ టన్నుల వంటగ్యాస్‌ వినియోగించారు. ఏటేటా ఇది 10 శాతం చొప్పున పెరుగుతుంది. తాజా అంచనాల మేరకు గ్యాస్‌ కనెక్షన్లలో 25 శాతం వరకు ఎస్సీ,ఎస్టీ కుటుంబాల వద్ద ఉన్నాయి. 43 శాతం కనెక్షన్లు దారి ద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఉపయోగిస్తున్నట్లు తెలుపుతున్నారు. మోడీ ప్రకటించిన ‘లీవ్‌ ఇట్‌ ఆఫ్‌ పథకంలో ఉన్నతవర్గాలు వదిలేసిన సబ్సిడీ విలువ రూ.21వేల కోట్లు ఆదా అవ్ఞతుంది. అదే విధంగా గ్యాస్‌ సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలో జమచేయడం వలన నకిలీ కనెక్షన్ల బెడద తొలగిపోయింది.

ప్రభు త్వంపై ఇచ్చే పైసా సబ్సిడీ వినియోగదారుడికి చేరుతుంది. దీనితో సబ్సిడీ భారం రూ.20వేల కోట్లకు పరిమితం అయింది. గతంలో కిరోసిన్‌పై సబ్సిడీ అన్ని వర్గాల వారికి అందించేవారు. మొదట్లో పింక్‌రేషన్‌ కార్డు వారికి 25 లీటర్ల వరకు అటు తర్వాత 10 లీటర్లకు, ఐదు లీటర్లకు తగ్గిస్తూ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి కిరోసిన్‌ ఎత్తివేశారు. తెల్లరేషన్‌ కార్డు వారికి ఐదులీటర్ల కిరోసిన్‌ ఇచ్చేవారు. మార్కెట్‌లో కిరోసిన్‌ ధర విపరీతంగా పెరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేశారు. గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న పేద వారికి కూడా సబ్సిడీని కిరోసిన్‌ 5 లీటర్ల నుండి ఒక్క లీటర్‌ తగ్గించి ఉన్న సబ్సిడీని ఎత్తివేశారు. పేద ప్రజల ఆరోగ్యం ముఖ్యం చెట్లను నరికి వంటచెరుకుగా ఉపయోగించడంతో ప్రకృతి, పర్యా వరణం దెబ్బతింటుంది.

కట్టె, బొగ్గు, పిడకలతో వంట చేయడం వల్ల వాతావరణంలో పెద్దఎత్తున కార్బన్‌డైయాక్స్‌డ్‌, కార్బన్‌ మోనా క్సైడ్‌ మిళితమైపర్యావరణం కాలుష్యమవ్ఞతున్న నేపథ్యంలో పర్యా వరణాన్ని కాపాడాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెపుతున్నది. ఈ నేప థ్యంలో గ్యాస్‌కనెక్షన్లు అందించాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకం ప్ర వేశమైంది. ప్రస్తుతంగ్యాస్‌ఇస్తున్న సబ్సిడీని తొలగించటంలో దా రిద్య్రంతో ఉన్న గ్రామీణ నిరుపేదలు తిరిగి వంట చెరుకువైపు మళ్లే ప్రమాదం ఉన్నది. దీనితో పేదలు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పేదలసంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుం టున్న ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్‌పై సబ్సిడీని కొనసాగి స్తూ ఉచితంగా అందరికికనెక్షన్లు ఇస్తూ పేదలఆరోగ్యాన్ని కాపాడాలి.

– ఉజ్జిని రత్నాకర్‌రావు

(రచయిత: ప్రధాన కార్యదర్శి, ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర సమితి)