సత్యం తెలిసొచ్చేసరికి..

LIONCOPY
ఎత్తైన చోట నిలబడి సింహం గాండ్రించిన దానికి ఆ చరియలో మసలుతున్న చిన్న, పెద్ద జీవాలన్నీ అదెక్కడ సమీపించి తమను చంపేసి తినేస్తుందేమోనన్న భీతి కొద్దీ కాలికి బుద్ధి చెప్పాయి. నీ పద్ధతేమైనా బాగుందా చెప్పు? ఇలా  ఉనికి నీ అంతట నువ్వే బయటపెడితే  నీ ఆకలి తీరడానికి ఏ జీవం దొరికేను? అని నక్కనైన నేను తనను సమీపించి అంటుంటే అదోలా నవ్వేసింది. జిత్తులమారి నక్కవని లోకులు అనడమే కానీ బుర్రపని చేయడం ఈ మాత్రమన్నమాట! నా గాండ్రింపు ప్రాణులను భీతిల్లచేసి దూరంగా పారిపోయేలా చేయడానికి కాదు. ఈ అడవికే నేను మకుటంలేని మహారాజునని వెల్లడి చేయడానికే, ఇంకా నేనెంత గొప్పదాన్నోనని నన్ను చూస్తూనే అంతా పారిపోవడం చూసైనా అహం చల్లార్చుకోడానికే ఇలా తను అసలు మర్మం బయటపెడుతుంటే ఇంకో ధర్మ సందేహం వెలిబుచ్చాను. నీ గొప్పతనం చాటుకోవడం వరకు ఒకే, నీ అహం తృప్తి చెందడం వరకు ఇంకా ఓకే! ఈ వరసన నీకు ఆకలేస్తే ఏ ప్రాణి దొరుకుతుంది మరి, అదాలోచించవేం? ఒంట్లో సత్తువ ఉన్నవి, హుషారుగా ఉన్నవి పారిపోగా నా ఉనికిని గమనించి నరాల బలహీనత ఉన్నవి కాళ్లు, చేతులు ఆడక ఉన్న చోటనే చతికిలపడేవి, దీర్ఘవ్యాధితో అంగుళం కూడా ముందుకు కదలలేనివి ఏ సమయాన్నైనా నాకు దొరక్క ఎక్కడికి పోతాయి? అంటూ తన తెలివిని చాటుతున్నట్లు విజయగర్వంగా చూసింది. ఓ! ఆ సౌలభ్యం ఒకటుంది కదూ. శభాష్‌! ఏదేమైనా నీ రాజసం ఈ అడవిలో ఏ జంతువుకుంది. సింహమా మజాకా.. అని దాన్ని పొగుడుతూ పక్కకు తొలగుతున్న నా దారికి అడ్డుపడుతూ ప్రస్తుతం నాకు ఆకలిగా ఉంది. అందుబాటులో నువ్వే ఉన్నావు. ఇప్పుడు నిన్నొదిలేస్తే ఇంకోవేట నాకు దొరకాలా, దానికెంత సమయం పడుతుందో, నేనాగలేను అంతదాకా.. అని చెప్తూనే ఉంది. దుర్మార్గపు సింహం వేగంగా నా మీద పడి గొంతు కొరికేయడము తృటిలో జరిగిపోయింది. అది క్రూరమృగమని తెలిసీ దీనితో బులిబుచ్చకాలకు పూనుకొన్న నాకీ శాస్తి జరగాల్సిందే.. వాపోతూనే తుదిశ్వాస విడిచాను.
మరోరోజు ఇదే విశ్వాసఘాతక సింహాన్ని నిలదీసింది పులి ఏ ప్రాణికైనా పట్టు విడుపులతో సహా నీతి కట్టుబాటు ఉండాలి. వాళ్లు, వీళ్లు చెప్పగా నా దృష్టికొచ్చింది. నీ అధికారం డాంభికాన్ని ప్రస్తావిస్తూ  ఒక విధంగా పొగుడుతూ పాపం ఆ నక్క నిన్ను అమాయకంగా నమ్మి సమీపించిందే అనుకో, అలా మీదపడి దారుణంగా చంపేయడమేనా నాకు నీ వరస నచ్చలేదు. నీ తీరు మార్చుకోవాలి, మనమెంత క్రూర మృగాలమైనా ఆ క్రూరత్వం చూపాల్సిన చోటనే చూపాలి కానీ అన్ని చోట్లా అంటే వనదేవత మెచ్చదు నీ అన్యాయాన్ని, అంటూ దాన్ని కోపంగా చూసింది. నా అధికారం, డాంభికం ప్రదర్శన నా ఇష్టం. అందుబాటులో ఉన్న ఏ ప్రాణినైనా ఆకలిగా ఉంటే చంపేసి తినేస్తాను, అదీ నా ఇష్టం. నీ అధికార దాహం, డాంభికం ప్రదర్శన నీలాంటి మూర్ఖులకే చెల్లు. ఎక్కడో తింటావు కాజా, దాంతో నీ ఆటలింక పూజ్యం. ప్చ్‌.. ఈ స్వగతంతో ఇక చేసేదేం లేనట్లు నిట్టూర్చింది. మంచి చెప్పచూసిన పులి తన శాపం ఫలించినట్లుగా కొన్నాళ్లలోనే ఓ మదం పట్టిన ఏనుగు కన్నుమిన్నుగానక పరిగెత్తడంలో పొరపాట్న దాని కాలికింద అదీ గొంతు మీదనే పడి ఊపిరాడక గిలగిలకొట్టుకుంది సింహం. తన దురదృష్టం కొద్దీ ఇంకో మదం పట్టిన ఏనుగు అదే సమయాన వెర్రి చిందులతో అటొచ్చి తన మిగిలిన శ్వాసను ఇంకో తొక్కు తొక్కి ఆర్పేసింది. నన్ను చూస్తూనే కలలో సైతం బెదిరిపోయే ఈ ఏనుగులు ఏకంగా నా మీదనే నడవాలా, ఎంత ఒళ్లు తెలియని స్థితిలోనైతేనేం.. మంచి, చెడు పాలు, నీళ్లలా విడమరిచే విచక్షణా జ్ఞానం శూన్యం కాగా అధికారం, డాంభికం అంటూ చెలరేగిన నా పాపం ఇవేళ్లికి  మూడింది. పశ్చాత్తాపం లేటుగా కలిగిన సింహం ఇలా వాపోయినా సరిదిద్దుకొనే సమ యం మించిపోయింది. ఝులుం, అహం అట్టే కాలం మనజాలవన్న సూక్తిని నిజం చేసి మరీ అసువులుబాసింది. పై నుంచి ఇదంతా తిలకిస్తున్న నా ఆత్మ శాంతించింది.

                       – వేలూరు మునుస్వామి, సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా