సంస్కరణలతో ఎఫ్‌డిఐలకు మంచి మద్దతు
వచ్చేఏడాది 45శాతం పెరుగుదల అంచనా
న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వచ్చే సంవ త్సరంలో మరింత మద్దతు లభిస్తుందని ఆర్థికరంగ నిపుణుల అంచనా. ప్రస్తుత ఎన్డిఎప్రభుత్వం 15 రంగాల్లో పరిమితులపై ఉన్న ఆంక్షలను సడలించడంతో ఈ కేలండర్ సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జనవరి-సెప్టెంబరు మధ్యకాలంలో 18శాతం పెరిగి 26.51 బిలియన్ డాలర్లవరకూ వచ్చాయి 2014మొత్తంగా చూస్తే భారత్ ఎఫ్‌డిఎ 28.78 బిలియన్ డాలర్లకు చేరింది. 2013లో 22 బిలియన్డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ)వచ్చాయి 2016లో కూడా ఎఫ్‌డిఐ 40-45శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయంగా ఆర్థికవృద్ధిపరంగా మందగమనం చోటుచేసుకోవడం భారత్ పై ప్రపంచ దేశాలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటం కూడా కొంత నిధులు పెంపుకు దోహదం చేస్తుందని అంచనా. పారిశ్రామిక ఉత్ప త్తి ప్రోత్సాహక మండలి కార్యదర్శి అమితాబ్‌కాంత్ అంచనాలప్రకారం వచ్చే ఏడాది కూడా ఎఫ్‌డిఐలు పెరుగు తాయని తెలుస్తోంది. సేవలరంగం, కంప్యూటర్హార్డ్వేర్, సాప్ట్వేర్, టెలి కాం, ఆటోమొబైల్, ఈక్విటీ ట్రేడింగ్ రంగాలకు ఎక్కువ నిధులు వచ్చాయి. సింగపూర్మార్గంలోనే ఎక్కువగా ఎఫ్‌డిఐ నిధులు భారత్‌కు వచ్చాయి. ఆ తర్వాత మారిషస్, యుకె, జపాన్, నెతర్లాండ్స్, అమెరికా దేశాల నిధులు కూడా భారీగానే అందాయి. ఎఫ్‌డిఐ పరిధిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక కసరత్తులు చేస్తోంది. భారత్‌లోని కీలకరంగాలుగా ఉన్నవాటిఓపాటు మొత్తం 98రంగాల్లో విదేశీ పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది. ఆటోమేటిక్ రూటులో ఈ పెట్టుబడులను విస్తరించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్న ఉద్యోగభవన్ను సందర్శించనవసరంలేకుండా ఆటోమేటిక్రూటులోనే పెట్టుబడులు స్వీకరించే అవకాశం ఉంది. బిజినెస్ సానుకూలవాతావరణం ఉన్న దేశాల్లో భారత్ 130వ స్థానానికి చేరింది. గత ఏడాది 142వ ర్యాంకు ఉన్న భారత్ మొత్తం 189 దేశాల్లో 130వ స్థానం ఆక్రమించింది. ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంమేరకు బిజినెస్ సానుకూలతను 50వ ర్యాంకుకు తీసుకురావాలని విస్తృత కృషి జరుగుతోంది. 2012-13 నుంచి 2016- 17 మధ్యకాలానికి భారత్‌కు లక్షకోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. 12వ పంచవర్ష ప్రణాళికలోనే ఈ పెట్టుబడులు అవసరం అవుతాయని నిపుణులు అంచనాలు వేసారు.ఎక్కువగా ఓడ రేవులు, విమానాశ్రయాలు,హైవేలకే ఈ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు కూడా 74శాతం స్థానికప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఎఫ్‌డిఐ నిబంధనల పరంగాచూస్తే రియాల్టీ, రక్షణరంగం, పౌరవిమానయాన రంగం, సమాచారప్రసారసాధనాల రంగంలో పెట్టుబడులను పెంచింది. సింగిల్బ్రాండ్రిటైలర్లు హైటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచింది. వాల్‌మార్ట్ వంటి బహుళబ్రాండ్ రిటైల్ సంస్థలకు మాత్రం 51శాతం మాత్రమే విదేశీ పెట్టుబడులను పరిమితం చేసింది.