సంతోషమే సగం బలం

HAPPY
HAPPY

సంతోషమే సగం బలం

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా అనేది తెలుగు నానుడి. సంతోషంగా ఉన్నపుడు మనసూ, మనచుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ సంతోషంగా ఉన్నట్లే కనిపిస్తాయి. అసలు మనిషికి సంతోషం ఎలా కలుగుతుంది. తాను కోరింది లభించినపుడు, తాను చేపట్టిన కార్యాలు సఫలమైనపుడు, ఏవిధమైన శారీరక, మానసిక బాధలూ లేనపుడు విజయాలు సాధించినపుడు సంతోషం కలిగినట్లు భావిస్తాం. మనిషి జీవితం చాలా చిన్నది. అందుకే మనం లభించిన దానితో సంతోషిస్తూ మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా ఆనందాన్ని పంచడమే అసలైన సంతోషం. సంతోషంగా ఉన్నపుడు మన శరీరం సైతం తేలికగా ఉంటుంది. ఏ పనైనా ఇట్టే చేయగలుగుతాం.

ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపుసొలుపేమున్నదీ అనే పాట వినే ఉంటారు అంతా. ప్రతిరోజు నీ ఆనందం చేసుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. వాటిని మనం అనుసరించినట్లయితే ఆనందం మనసొత్తే. తృప్తిలో ఉన్న ఆనందం దేనిలోనూ రాదు. బంగారు కంచంలో పదహారు రకాల స్వీట్లు తినేవాడు ఆనందంగా ఉన్నాడని చెప్పలేం. అతడు తన ఆస్తిపాస్తుల రక్షణ గురించే నిరంతరం ఆలోచిస్తూ చింతిస్తూనే ఉంటాడు. రోడ్డు పక్కనే గుడిసెలో ఉన్న వ్యక్తి తన కుటుంబంతో కలిసి గంజి త్రాగుతూ ఆనందంగా ఉండటాన్ని చూస్తే మనకు ఆనందమెక్కుడుందో అర్థమవ్ఞతుంది. పుట్టుక వెనుకే చావ్ఞ. ఈలోగా జీవనయానం అనేక విధాలుగా సాగుతుంటుంది.

ఈలోగా చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, బాధ్యతలు, బరువ్ఞలూ, కర్తవ్య నిర్వహణ, అహంకారం, మమకారం, పగ, ప్రతీకారం, కోపం, దాని వలన చేసే పాపం, స్నేహం, విరోధం, ప్రేమ ఇదే జీవితం. ఎగుడుదిగుడుల కంకర రాళ్ల బాటన ఒంటెద్దు బండిలో గతుకులతో సాగిపోతుంటుంది జీవితం. ఎవ్వరూ ఈ ఒడిదుడుకులను తప్పించుకోడం సాధ్యం కాదు. కనుక సహజం అయిన దాన్ని తనకే ప్రాప్తించే కష్టంలా కాక, ఇది అందరికీ సర్వసాధారణమని భావించినపుడు అంత బాధ ఉండదు.

ఎవరి జీవితమూ పూలబాట కాదు. వడ్డించిన విస్తరి కాదు. ముళ్లు, రాళ్లూ, పూలూ అన్నీ కలిస్తేనే జీవితం. చేదు రుచి తెలీకుండా తీపి రుచి తెలీదు. కేవలం సుఖాలనే చూసిన తర్వాత కష్టాల్ని చూసిన సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిపోవడం మనకు తెలుసు. కనుక కష్టసుఖాలు కావడి కుండలని విశ్వసించాలి. జీవితం కోసం జీవించడం ఒక అపూర్వమైన వరము. మనకోసం మనం జీవించాలి. ఆశ, అహంకారం అనే వాటిని వదలి మనచుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ, స్నేహభావంతో మెలగాలి. మంచిలోనే సంతోషం ఉందని గుర్తించాలి. గతాన్ని గురించి తలంచి చింతించక, భవిష్యత్తు గురించీ భయపడక వర్తమానంలో నర్తించాలి. జీవించే ప్రతిక్షణం మనదిగా భావించాలి.

అది హ్యాపినెస్‌డే సెలెబ్రేషన్‌. అదే ఆనంద దినోత్సవం. మనం మన జీవితాన్ని ఇష్టపడుతూ మనల్ని మనం ప్రేమించుకుంటూ తోటివారికి ప్రేమ పంచాలి. త్యాగంలోని సంతోషాన్ని అనుభవించాలి. నిరంతరం ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిని ఆనంద పరచాలి. పరిశుద్ధ మనస్తత్వం కలిగి ఉండాలి. భయాన్నీ వీడి, సేవాభావాన్ని పెంచుకోవాలి. అపుడు అంతా నీకు స్నేహితులే, నీ శ్రేయస్సు కోరేవారే! వారందరి నడుమా ఆనందం కాక మరేముంటుంది? పరోపకారం ఇదం శరీరం. పర ఉపకారమే స్వఉపకారంగా భావించడమే ఆనందమయ జీవితానికి అసలు రహస్యం. ఈ సంతోష దినోత్సవాన్ని ముందుగా పోర్చుగల్‌ దేశస్థుడైన లిబర్టో పెరెడా అనే వ్యక్తి అంతర్జాతీయ హ్యాపీనెస్‌డేని ప్రారంభించాడు. ప్రపంచములో అందరూ ఆనందంగా జీవించాలన్నదే ఈ దినోత్సవ ఉద్దేశ్యం.

జీవితం ఆనందకరముగా ఉండేందుకు ఎన్నో సూత్రాలను అనేక దేశాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజున కొందరికైనా ఏదైనా సాయమో, భోజనమో, బట్టలో, వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమ సందర్శనమో చేయడం ఉత్తమోత్తమం. హ్యాపినెస్‌డే అసోసియేషన్లు చాలా దేశాల్లోనూ ఏర్పడ్డాయి. ఈరోజున నీతో పాటు మరికొందర్ని సంతోషపడితే అదే నిజమైన సంతోషదినోత్సవం. 194 దేశాల్లో హ్యాపీనెస్‌డే అసోసియేషన్స్‌ ఉన్నాయి. కొన్ని దేశాలు జూలై 10న ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డేని జరుపుకుంటున్నారు. మనదేశముతో పాటు చాలా దేశాలు ఆగస్టు 8న జరుపుకుంటున్నాము.