‘సంజన ‘ స్వరార్చన

singing-1
singing-

‘సంజన’ స్వరార్చన

శ్రావ్యమైన గళం అందరిని మైమరిపింప చేస్తుంది, మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె పాట వింటే అందరూ తన్మయత్వం చెందుతారు, మరిన్ని పాటలు వినాలని ఆరాట పడతారు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. ఆరోజు శ్రీరామ నవమి, సీతారామ కల్యాణం వైభవంగా జరుగుతుంది. భక్తులంతా శ్రద్ధగా కూర్చున్నారు. కాని కార్యక్రమం ప్రారంభానికి కొంత సమయం పడుతుంది, ఈ సమయంలో ఒక గళం ‘పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనే అన్నమయ్య కీర్తన ప్రారంభించింది. భక్తజనమంతా మైమరచిపోయారు.

ఆమె ఎవరు అని ఆరా తీస్తే పేరు సంజనా భరద్వాజ్‌ అని తండ్రి కృష్ణమాచార్యులు అని తెలిసింది. ఆయన దేవాలయ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజనతో మాట్లాడి వివరాలు అడగాలనిపించింది. ఆమె బిబిఎ చదువుతోంది. మిగతా సంగతులు ఆమె మాటల్లోనే ”నేను చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టపడేదాన్ని ఎందుకంటే నాన్నగారు ఎప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు. హిందీ పాటలంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. నా అభిరుచిని కనిపెట్టిన నాన్న నన్ను లక్ష్మి గారి వద్ద చేర్పిస్తే అక్కడ సరిగమలు, కీర్తనలు నేర్చుకున్నాను. ఆ తరువాత రామాచారి గారి వద్ద శిక్షణ పొందాను.

ఎంతో మందికి గుర్తింపు నిచ్చిన లిటిల్‌ మ్యూజీషియన్‌ అకాడెమీ అది. దాంతో నాకు సంగీతంపై అవగాహన పెరిగింది. ఎన్నెన్నో పోటీలలో పాల్గొన్నాను. ఫలితంగా నేను అవార్డులు, రివార్డులను కూడా అందుకున్నాను. అమ్మ శేషఫణి కూడా నన్ను ప్రోత్సహిస్తుంది. టి.వి. కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాను. లిటిల్‌ సోల్జర్స్‌ అనే సినిమాలో నా పాటలు వినవచ్చు. మొదట నేను 2009లో సికింద్రాబాద్‌లోని హనుమాన్‌ దేవాలయంలో నా గళం విప్పాను. ఆ తరువాత సాలూరి కోటి గారు స్వరపరిచిన పాటల పోటీలో పాల్గొన్నాను. అభినవ్‌ ఫౌండేషన్‌వారు ఏర్పాటు చేసిన కిషోర్‌కుమార్‌ మ్యుజికల్‌ నైట్‌లో పాటలు పాడాను, సప్తగిరి చానల్‌ వారు అవకాశం ఇచ్చారు. వినాయక నవరాత్రుల సందర్భంగా టివి 9 వారు ఏర్పాటు చేసి కార్యక్రమంలో భాగస్వామినయ్యాను. ఇలా చాలా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. నాకు సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి,

నా గళాన్ని పరీక్షించారు, అయితే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష నాకు ఉంది. మా నాన్న దేవాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు, మంచి చిత్రకారులు, గాయకులు కూడా. సమాజసేవ అంటే ఎంతగానో ఇష్టపడతారు. మా అక్కయ్యకు కూడా పాడుతుంది. నాకు అమెరికాలోని తానా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన వలసిందిగా ఆహ్వానం అందింది. కాని ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల వెళ్లలేకపోయాను. భవిష్యత్తులో నా కల నెరవేరుతుందన్న ఆత్మ విశ్వాసం నాకు ఉంది అని చెప్పారు సంజనా భరద్వాజ్‌

. – ఆద్య తిరునగరి