సంక్షోభాల ఊబిలో సమాజం సతమతం

          సంక్షోభాల ఊబిలో సమాజం సతమతం

society
society

అత్యంత ప్రాచీనమైన భారతీయ వైవాహిక వ్యవస్థ,కుటుంబ బాంధవ్య జీవన సంపన్నతకు ఆధారంగా జన జీవన కల్యాణానికి అనాదిగా ప్రాణ ప్రతిష్ట చేస్తోంది. యుక్త వయస్కు లైన యువతరం సుఖ సంతోషాల భవిష్యత్తు జీవన యానానికి,ప్రాతి పదిక అయిన వైవాహిక ఘట్టం, ఆత్మీయతా అనురాగాల స్త్రీ, పురుష సాన్నిహిత్య బాంధవ్యంతో ముడిపడి వుంది. సనాతన సంప్రదాయ జీవన విధానాలలో, పాశ్చాత్య ఆలోచనల భావజాలం చొచ్చుకు వచ్చినా భారతీయ వైవాహిక వ్యవస్థ పదిలంగా కొనసాగుతోంది. ప్రాచీన సనాతన సమాజంలోని పురుషాధిక్యతకు, స్త్రీ తలవంచనంత కాలం నాటి సమాజ నడవడిక స్వరూపం విభిన్నంగా కొనసాగింది.

సతీ సహ గమనాలు, బాల్య వివాహాలు, బహుభార్యాత్వం, బాలికలకు విద్యావకాశాలకు ప్రాధాన్యత లేకపోవటం, దేవదాసీలు, ఉంపుడు గత్తెలు పలు దురాచారాలు, కన్యాశుల్కాలు ఎన్నో వ్యవహారాలు నిర్నిరోధంగా కొనసాగుతుండేవి. బ్రిటిష్‌ పాలనా విదేశీ సంస్కృతి, విద్య ప్రభావం కారణంగా భారతీయ జీవన విధానాలు, నాగరి కతా సమాజాన్ని ఆవిర్భవింప చేసాయి. దానికితోడు స్వాతంత్య్రా నంతరం, భారతీయ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ,సమానత సాధించే దిశలో మహిళల రక్షణకు, కొత్తగా చట్టాలు పుట్టుకొచ్చా యి.

వైవాహిక వ్యవస్థకు సంబంధించి వరకట్న నిషేధం, గృహ హింస, వేధింపులు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు ప్రేరణ, వర కట్న లేదా ఇతర మరణాలు ఎన్నో నేరాలపై న్యాయవ్యవస్థకొరడా ఝళిపిస్తోంది. భార్యభర్తల బాంధవ్యంలో విడాకుల చట్టం ప్రవేశిం చింది. భారతీయ మహిళకు రక్షణ,స్వేచ్ఛ, సమానహక్కులు, జీవ న భద్రత, సాధికారికత, అన్ని రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు కుటుంబంలోనే కాకుండా సమాజంలో సమాన గౌరవ ప్రతి పత్తులు లభించే సత్కృషి ప్రభుత్వాలు,న్యాయ వ్యవస్థ ప్రసాది స్తోంది.

అయినప్పటికీ, రోజురోజుకు విచ్చలవిడిగా పెరుగుతున్న నేరాలు, లైంగికదాడులు, అత్యాచార ఘోరాలు, అమానుష అకృత్య అవమానాలు మహిళల బతికే హక్కును సైతం హరి స్తున్నాయి.దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ట్రి పుల్‌ తలాఖ్‌, మహిళలకు గర్భగుడి ప్రవేశం వంటి అంశాలలో ప్రభుత్వాన్ని,వ్యవస్థను నిలదీసింది. సెప్టెంబరు నెలాఖరులో సెక్షన్‌ 497 కొట్టి వేయటం, అన్నింటికంటే సంచలనాత్మక అంశమైంది.

శృతిమించిన స్వేచ్ఛ సృష్టించే వికృత ధోరణులు
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 497, 158 ఏళ్ళ నాటి చట్టంగా యింతవరకు మహిళా లైంగిక స్వేచ్ఛను ప్రశ్నిస్తోంది. మనదేశంలో పురుషులకు ఒకప్పుడు వివాహేతర సంబంధాలు గర్వకారణంగా కూడా కొందరు భావించేవారు. 497 సెక్షన్‌ ప్రకా రం భర్త, తన భార్య ప్రేమికున్ని నేరస్థునిగా శిక్షపడేటట్టు చేయ వచ్చు. అంటే పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమెపై ఆస్తిగా, హక్కు ప్రాప్తిస్తోంది. అదేవిధంగా సెక్షన్‌ 198(2) ప్రకారం భర్తకు మాత్ర మే అటువంటి నేరంపై కంప్లైంట్‌ చేసే అవకాశం వుంది. సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ రోహిన్‌ టన్‌ నారిమన్‌ జస్టిస్‌ ఇందు మల్‌హోత్రా వ్యక్తం చేసిన న్యాయాభి ప్రాయాలు దేశ మంతటా సంచలనం సృష్టించాయి.

సెక్స్‌ సంబంధాలు వివాహేతరులతో అయినా నేరంకాదని ఆ చట్టాలు కొట్టేయటం ఆసక్తికరమైన అంశంగా ఆకట్టుకొంది. మానవులలో లైంగికతా ఆకర్షణలు ప్రగాఢమైనవి. బాహాటంగా వ్యక్తీకరించలేక రహస్యాలుగా అణచివేయబడుతుండటం సహజం. అందులో వివాహితులైన మహిళలయితే, అటువంటి వాంఛలు ఘోరనేర అపరాధాలుగా, ఎందరికో ప్రాణాలు సైతం పోయే ప్రమాదాలు పొంచి వుంటాయి. భర్త లేదా కుటుంబసభ్యులు, సమాజం, ఎవ్వరూ ఆమోదించి అటువంటి వారిని హర్షించలేరు. ఆ ప్రగాఢ వాంచల వలయంలో చిక్కుకొన్న యువతలైనా, గృహిణులైనా ఎంతో సాహసవంతులైతే తప్ప సుఖంగా జీవించలేరు.

వివాహేతర సంబంధాలు తప్పు కాదని, నేరంగా భావించడం సమంజసం కాదని, భార్యలైంగిక అధికారాన్ని అరికట్టే శాసించే హక్కు భర్తకులేదని న్యాయాధీశులు, సెక్షన్‌ 497 కొట్టి వేయటం వలన భారతీయ మహిళలకు ఒరిగేది ఏమీ లేదు. భార్యలప్రాణాలు సునాయాసంగా తీసేభర్తలు, హత్యలతో అట్టుడికి పోతున్న భారతీయ సమాజ స్థితిగతులలో మహిళలు యింకా సాహసిస్తే, నేర ప్రవృత్తి మరింతగా పెరిగే ప్రమాదాలతో ఆ కుటుంబాలలో సుఖశాంతులు కనుమరుగయ్యే వికృతత్వం చోటు చేసుకొంటుంది. సమానతా విలువల మాట అటుంచి, సంక్షోభాల ఊబిలో సమాజం చిక్కుకొంటుంది. (3) ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాలు స్వేచ్ఛాయుతం గా ప్రలోభంలోకి దించుతున్నాయి.

స్త్రీకి హృదయం వుంది. శరీరం వుంది. వాంఛా వ్యామోహాలకు ఆమె అతీతురాలు కాదు పురుషునితో సమానంగా అనుభవించే స్వేచ్ఛ, ఇవ్వాలని మేధావి వర్గం గుర్తించారు. అణచివేత, ఆధిక్యత అధునాతన మహిళ మౌనంగా సహించి భరించే, స్థితిగతులు మారిపోతున్నాయి. భర్త తోటిదే లోకంగా అత్యధిక శాతం కుటుంబవ్యవస్థకు అంకితమవు తున్నారు. అడపాతడపా ప్రేమ ఇతర ఆకర్షణల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, జంట మరణాలు, రాగద్వేషాలు తప్ప టం లేదు. యవ్వనంలో సెక్స్‌ పరమైన ఆకర్షణలు జీవితాంతం వుండేవి కాకపోవడంతో, క్షణికావేశంలో మహిళ,మోసాలకు, వంచనకు గురి అవుతోంది.

పురుషునితో న్యాయం,మహిళకో న్యాయం విక్టోరియన్‌ కాలంనాటి నైతికత, నేటికీ రాజ్యమేలు తోంది. ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇండొనేసియ, ఇరాన్‌, మాల్దీవ్స్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, యుఎయి, యు.ఎస్‌ లో కొన్ని రాష్ట్రాలు, అల్జీరియా, కాంగో,ఈజిప్టు, మొరాకో, నైజీరియా కొన్ని భాగాలలో అడల్టీ నేరంగానే వుంది. చైనా, జపాన్‌, బ్రెజిల్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి పలు దేశాలలో మహిళలకు పరపురుష బాంధవ్యం నేరం కాదు. కేరళకు చెందిన ఒక ప్రవాస భారతీయుడు జోసఫ్‌ షైన్‌ 2017 అక్టోబరులో, సుప్రీంకోర్టులో సెక్షన్‌ 497 పై వేసిన పిటిషన్‌పై 2018 సెప్టెంబరులో సుప్రీం కోర్టులో, ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సెక్స్‌ బాంధవ్యంపై స్వేచ్ఛ, భార్యకు హక్కుగా తీర్పుయిస్తూ, భార్య యొక్క ప్రియున్ని చట్ట ప్రకారం భర్త శిక్షించే ఆ చట్టాన్ని కొట్టేసి, సంచలనాత్మక జడ్జిమెంటు వెలువరించింది.

400 ఏళ్ళ నాటి శనిసింగనాపూర్‌ ఆలయంలో, మహిళల గర్భగుడి ప్రవేశ నిషేధాన్ని కొట్టివేయటం, అట్లాగే మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశ ఆంక్షలు తొలగించడం, అన్నింటికీ మించి వివాహితల వివాహేతర సంబంధాలపై, సుప్రీం న్యాయాధీశుల, ఈ జడ్జిమెంటు దేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ మహిళకు బాసలుగా జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింప చేస్తోంది కాని పర్యవసానాలు చూడవలసినదే.
– జయసూర్య, సీనియర్‌ జర్నలిస్టు