సంక్రాంతికి 3,262 ప్ర‌త్యేక బ‌స్ స‌ర్వీసులు

TSRTC
TSRTC

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జంట నగరాల నుంచి ప‌లు ప్రాంతాలకు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆంధ్రాకు 1352, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 1910 బస్సులు నడపనున్నట్లు, ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు వీటిని నడుపుతామని వివరించారు. 11,12 తేదీల్లో రోజువారీగా నడిచే బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి అయ్యాయని, ప్రత్యేక బస్సుల కోసం ఆన్ లైన్ రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. దీనిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా శివారు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామని, విజయవాడ, ఖమ్మం వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ నుంచే నడుపుతామని అన్నారు. సంక్రాంతి నాలుగు రోజులు ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, ఎల్బీనగర్, ఉప్పల్ బస్ స్టాపుల్లో సీనియర్ అధికారులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటారన్నారు. దూర ప్రాంతాల బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు ఉంటాయని వెల్లడించారు.