షూటింగ్ ఆగలేదన్న నిర్మాత!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ఉన్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాగా మొదట్నుంచీ ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న ఈ సినిమాకు పవర్ సినిమాతో మెప్పించిన బాబీ దర్శకుడు. శరత్‌మరార్ భారీ బడ్జెట్‌తో పలు గ్రాండ్ లొకేషన్స్‌లో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌కు బ్రేక్ ఇచ్చారని, పవన్ కళ్యాణ్ షూటింగ్‌ను ఆపేసి కొద్ది రోజులు విశ్రాంతికి వెళ్ళారనే ప్రచారం వినిపించింది. ఇక ఈ నేపథ్యంలో నిర్మాత శరత్ మరార్, సర్దార్ లేటెస్ట్ షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ జరుగుతుందని, షూటింగ్ ఎక్కడా ఆగలేదని, పవన్ కళ్యాణ్ సమ్మర్ సీజన్‌కు ఈ సినిమాను సిద్ధం చేసేలా తనవంతుగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని స్పషం చేశారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీం ప్లాన్ చేస్తోంది.