షర్మిలపై అసత్య ప్రచారం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

sharmila
sharmila

సైఫాబాద్‌ :ఆధ్యాత్మిక ప్రభోదకుడు రెవరెండ్‌.బ్రదర్‌ అనిల్‌కుమార్‌ భార్య, వైకాపా నాయకురాలు వై.ఎస్‌.షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన అసత్య ప్రచారాలను క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రోటెక్షన్‌ కమిటి తీవ్రంగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కమిటి ప్రతినిధులు హెచ్చరించారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటి వ్యవస్ధాపకుడు రెవరెండ్‌.కె.సుందర్‌రాజు, ప్రధాన కార్యదర్శి రెవరెండ్‌.డి.శాంతికుమార్‌, కోశాధికారి ఎం.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అమె మీద అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని, ఆనాటి నుంచి ఇటీవల వచ్చిన ప్రచారాలతో ఆమె కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతున్నదని విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు నైతిక బాధ్యత వహించి, దోషులను అరెస్టు చేయాలని కోరారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.