శ‌ర‌త్ కుటుంబానికి అండః సుష్మ‌

Sushma Swaraj
Sushma Swaraj

ఢిల్లీ: అమెరికాలో దుండగుల చేతిలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి శరత్‌ కొప్పు మృతిపై విదేశంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్‌ ద్వారా మృతుడి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. ‘కన్సాస్‌ ఘటన నన్ను కలిచి వేసింది. శరత్‌ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘటనపై పోలీసుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నాం. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌ కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.