శ్వేతాశ్వతరోపనిషత్తు

                               శ్వేతాశ్వతరోపనిషత్తు

Lord Krishna
Lord Krishna

ఈ ఉపనిషత్తు కృష్ణయుజుర్వేద సంబంధితమైన శైవము ద్వారా బ్రహ్మ సిద్ధాంతమును తెలియచేయుచున్నది. బ్రహ్మవేత్తలైన బుషుల ప్రకారము ఈ జగత్తుకు మూలకారణమైన బ్రహ్మ ఏ రూపములో ఉన్నాడు. మన ఉత్పత్తికి కారకులెవ్వరు? మనము ప్రాణము లతో ఉండుటకు కారకులెవ్వరు? మనము ఎచ్చట వసించబడుచున్నాము? ఓ బ్రహ్మజ్ఞానులైన మహర్షులారా! మనము ఎవరి ప్రేరణ చేత ఈ సంసార చక్రబంధంలో భ్రమణము చేయుచున్నాము? కాలము, స్వభావము, సునిశ్చిత కర్మఫల వ్యవస్థ, ఆకస్మిక ఘటనలు, పంచమహాభూతములు జీవాత్మ మున్న గునవన్నియును ఈ జగత్తు కారణభూత తత్వములు అవ్ఞనా కాదా అను అంశమును చర్చించవలసి యున్నది. వీటన్నింటి సముదాయము కూడా ఈ జగత్తుకు కారణమని అనుకోలేము ఎందుకంటే ఇవన్నియును ఆత్మ ఆధీనంలో ఉన్నవి. ఆత్మ కూడా కారణం కాదని తెలుస్తోంది.

ఎందుకంటే సుఖ దుఃఖముల కారణభూత కర్మఫల వ్యవస్థ ఆధీనములో ఉన్నది. కేవలం బౌద్ధిక వివేచన ద్వారా బ్రహ్మార్దమును తెలిసికొనుట సంభవము కాదు. ధ్యానము అంతర్గత ఆత్మ చైతన్యము ద్వారానే గుణముల ఆదరణ తొలగించుకుని ఆ పరమతత్వము అనుభవమును పొందవచ్చును. అయిదు ఉద్గమ స్థానాలు కలిగిన ఒక మహానది ఉరవళ్లతో, పరవళ్లతో, వంకరటింకరగానే కాని మహా ఉధృతంగా అయిదు ప్రాణరూప తరంగాలు కలిగి, అయిదు రకాల మానసిక స్థాయిలతో, అయిదు భ్రమరాలు కలిగి, అయిదు రకాలైన దుఃఖాల వేగముతో, అయిదు పర్వములు కలిగి యాబది రకాల భేదములతో ప్రవహించుచున్నది. బుషి ఇచ్చట విశ్వ ప్రవాహమును ఒక మహానదితో పోల్చి చెప్పటం జరిగింది.

అయిదు ఉద్గమ స్థానాలు అనగా అయిదు తత్వాలు, అయిదు ప్రవాహాలు అనగా అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు ప్రాణరూప తరంగాలు, భ్రమరాలు అనగా తన్మాత్రలు, అయిదు దుఃఖములు అనగా గర్భము, జన్మము, వ్యాధి, ముసలితనము, మరణము ఇవి కాకుండా అజ్ఞానము, అహంకారము, రాగము, ద్వేషము, భయము, ఏబది రకాల అంతఃకరణ చిత్తవృత్తులున్నాయి. వేదాలలో వర్ణింపబడిన పరబ్రహ్మ అవినాశియై యున్నాడు. అతనిలోనే మూడు లోకాలు స్థితమై యున్నవి. బ్రహ్మవేత్తలైన మహా పురుషులు బ్రహ్మ తమ అంతరాళాలలో వసించి యున్నాడని తెలిసికొని నిష్ఠాపూర్వకముగా అందులో లీనమై పోయి భిన్నమైన యోనులలో నుండి, జన్మబంధము నుండి ముక్తులగుదురు.

విద్వాంసుడైన పురుషుడు ఆహారవిహారాదులను నియమిత ప్రకారము చేస్తూ ప్రాణాయామము తప్పక నిర్వర్తించవలెను. పృథ్వి, జలము, అగ్ని, వాయువ్ఞ, ఆకాశము అను ఈ పంచ మహాభూతముల ఉత్థాన సంబంధిత పంచయోగముల అభ్యాసము చేత యోగాగ్నిమయ శరీరము ప్రాప్తించును. పరమాత్మ వేలాది తలలు కలిగి, వేలాది నేత్రములు కలిగి, వేలాది కాళ్లు కలిగి ఉన్నాడు. సంపూర్ణ జగత్తును అన్ని వైపుల నుండి ఆక్రమించిన పరమేశ్వరుడు ప్రతి మనిషి నాభి నుండి పది అంగుళముల దూరమున ఉన్న హృదయాకాశములో స్థితమై ఉన్నాడు.
– యం.వి. నరసింహారెడ్డి