శ్రీఆదిశంకరులు

పరమేశ్వరుడు మానవజాతికి జ్ఞానభిక్ష పెట్టుటకై కృతయుగమున దక్షిణామూర్తి రూపమున, ద్వాపరయుగమున వేదవ్యాస రూపమున, కలియుగమున శ్రీ శంకర భగవత్పాద రూపమున అవతరించెనని భారతీయుల విశ్వాసం. శ్రీ శంకర భగవత్పాదులు భారతదేశంలో అవతరించిన తత్త్వవేత్తలలో అగ్రగణ్యులు, దార్శనికులలో కైలాస శిఖర సన్నిభులు. భారతీయతత్త్వ జిజ్ఞాసా పరిణతకు దర్పణం శంకరుల రచనలు. శంకరులు ఎనిమిదవ యేటికే వేదాధ్యయనం పూర్తి చేశారు. పదహారు సంవత్సరాలు వచ్చునప్పటికే గొప్ప తత్త్వవేత్తగా ఆచార్యునిగా ప్రసిద్ధి పొందేరు. ఆనాడు దేశ ప్రజలలో అధర్మం పెరిగిపోయింది. వేదవిహిత కర్మాచరణం కనుమరుగు కాజొచ్చినది. బౌద్ధుల వేద విరుద్ధ సిద్ధాంత ప్రచారము ప్రచం డంగా సాగుతోంది. శాక్తేయుల వామాచారము, జంతుబలులు మితిమీరినవి. ఐహికసుఖములే ముఖ్యమను చార్వాకుల ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. సౌర, అగ్ని, హిరణ్య గర్భ, వీరశైవ, శూన్యమతం వంటి 72 మతములు బయలుదేరి అవైదిక ఆచారాలను వ్యాప్తి చేస్తున్నాయి. మొత్తం మీద సంఘమంతా నీతి బాహ్యమై అల్లకల్లోలంగా ఉంది. భౌగోళికముగా కూడా దేశం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి చిన్నాభిన్నమయ్యే దశకు చేరుకుంటోంది. అటు రాజ్య విస్తరణ ఆధిపత్యముల కొరకు యుద్ధాలు జరుగుచున్నట్లే, మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని తాత్విక ఆధిపత్యం కొరకు కూడా నిరంతర పోరాటం జరుగుతున్నది. దేశ సంక్షేమ, సమైక్యతలు సాధించుటకు, ప్రజానీకమును ఏకోన్ముఖులు గావించగల శక్తి ఒక్క అద్వైతానికే ఉన్నదని భావించారు శంకరులు. సనాతన ధర్మము సమాజమున సుప్రతిష్టితమగుటయే పరమ లక్ష్యమైనది. అద్వైత ప్రచారం, ఆర్ష సంస్కృతీ పరిరక్షణ భారతీయ జీవన స్రవంతిలో కలకాలం కొనసాగాలని సంకల్పించి, నాలుగు మఠాఅమ్నాయ పీఠాలను శృంగేరి, ద్వారక, పూరీ, బదరీ క్షేత్రాలలో స్థాపించారు. పాశ్చాత్య పాలనానంతరమే రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఐక్యత సంభవించినదనుకొనుట ఒక అపప్రద అని నిరూపించుటకా అన్నట్లు 8వ శతాబ్దముననే భారతదేశమున ధార్మిక సాంస్కృతిక ఐక్యతను పునరుద్ధరించారు. ఉత్తరాది మహిష్మతీ నగర విద్వాంసుడగు సురేశ్వరులు దక్షిణాది శృంగేరి మఠ ఆచార్యుడైనాడు. దక్షిణాది బ్రాహ్మణోత్తముడగు తోటకాచార్యుడు ఉత్తరాది జ్యోతిర్పీఠాధిపతిగా నియుక్తుడైనాడు. కేరళ నంబూద్రి బ్రాహ్మణులు బదరిలో పూజారులుగా, కర్ణాటక దేశీయులు నేపాల్‌లోను, మహారాష్ట్ర విప్రులు రామేశ్వరంలోను అర్చకులుగా ఉండ వలెనని నియమం చేశారు. ఇంతకన్నా మహో దాత్తమైన జాతీయ సమైక్యతా సంఘటన మరొకటి కలదా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఆర్షధర్మాన్ని వ్యతిరేకించే శక్తులు వక్రీకరించే శక్తులు నేటికన్నా ఆనాడే ప్రబలంగా ఉన్నాయి. శ్రీశంకరులు ఒక్క చేతి మీదుగా ఆ శక్తులను ఎదుర్కొని వేదధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని పునః ప్రతిష్టించారు. దీనికి వారుపయోగించిన సాధనం కేవలం జ్ఞానమార్గమే! బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు అసదృశ్యమైన వ్యాఖ్యానాలు రచించారు. తర్క వేదాంతాలలో జ్ఞానానికి శంకరులు భాష్యాలు, భక్తిప్రపత్తులు, ఆచరణజ్ఞానం పెంపొందించుకోవటానికి వివేక చూడామణి, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, ఆత్మానాత్మ వివేకం ఉపదేశ సాహసి వంటి శంకరుల ప్రకరణ గ్రంథాలు అధ్యయనం చెయ్యాలని అంటారు. జ్ఞానవాదిగా వినుతికెక్కిన శ్రీ శంకరుల భక్తి ప్రధానమైన అనేక స్తోత్రాలు రాసి భక్తిమార్గం కూడా మోక్షసాధనకు అనువైనదేనని విశదం చేశారు.

తాను నమ్మిన అద్వైతం సిద్ధాంతం పట్ల సమగ్ర అవగాహన మాత్రమే కాదు సంపూర్ణముగా అనుభూతి చెందిన పరిణత వారిది. అందుచేతనే శంకరుల రచనలలో ఎక్కడా వైరుధ్యం గాని అసహజత గాని అస్పష్టత గాని గోచరించదు.

”అల్పాక్షఱ మసందిగ్దం సారవద్విశ్వతోముఖం
అస్తోభ మనవద్యంచ సూత్రం సూత్రవిదోవిదుః” అన్న శ్లోకానికి భాష్యం అనదగ్గవి వీరి రచనలు.
32 సంవత్సరాలు మాత్రమే జీవించిన అల్పా యుష్కులు శ్రీ శంకరులు. అయితేనేం శతా యుష్కులు అనేకమంది చేయదగు మహత్కా ర్యాలు చేసి మార్గదర్శనం చేసిన మహనీయుడు. సర్వజనులకు ఉపయోగపడునట్లు వారివారి యోగ్యతానుసారం ఆచరింపవీలగు సర్వసాధనా మార్గములను వివిధ గ్రంధముల ద్వారా విశదపరిచారు.

అతి చిన్న జీవితకాలంలో వారు 24 భాష్యగ్రంథాలు, 85 ప్రకరణ గ్రంథాలు, 91 స్తోత్రగ్రంథాలు రచించారు. ఈ బృహత్‌ గ్రంథం రాసిన తోడు శిష్యులకు శిక్షణ, అన్యమత, అన్య సిద్ధాంత కర్తలతో శాస్త్రవాదములు, చతురా మ్నాయ మఠస్థాపనం వంటి బృహత్కార్యభారాన్ని నిర్వహించిన ప్రజ్ఞాధురీణులు శంకరులు.
ఏకం సత్‌ విప్రా బహుథావదంతి అని నమ్మిన ఆచార్యులు ప్రధానంగా ప్రజలలో మత ఐక్యతకు, ధర్మాచరణకు పాటుపడ్డారు గాని ఒకే మతం ఉండాలని అనలేదు. అందువల్లనే పంచాయతన పూజాది ఆరాధనా విధానములను ప్రవేశపెట్టేరు. షణ్మత స్థాపనాచార్యులుగా ప్రసిద్ధి చెందేరు. పాదచారులై భారతావని నంతనూ ముమ్మారు సంచరించి పరివ్రాజకులై, ప్రవక్తలై, సంఘ సంస్కర్తలై, కవీశ్వరులై ఆర్షధర్మవైభవానికి పునర్జననిచ్చిన కారణజన్ములు.

వారి కృషి, వారి ఉపదేశాలు, ప్రతిక్షణం, ప్రతిదినం స్మరించదగినవి. ఎక్కడో కాలడిగ్రామంలో ప్రారంభమై, పూర్ణానదీ తీరాన్ని పునీతం చేసి, కేదార్‌నాథ్‌లోని జాహ్నవీ జలధారలలో అద్వైతామృతాన్ని రంగరిస్తూ 32 సంవత్సరాలు సాగిన శ్రీశంకర భగవత్పాదుల ఆధ్యాత్మిక మహాప్రస్థానం భారతచరిత్రలో ఒక అద్వితీయ, అపురూప చిరస్మరణీయ సన్నివేశం.ఆర్షధర్మజ్యోతిని దేశపు నలుమూలలా ప్రసరింప చేసిన శంకరుల సంస్మరణగా వైశాఖ శుద్ధ పంచమిని శంకర జయంతిగా జరుపుకుంటున్నాం. కొద్దికాలం క్రితం కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు శంకర జయంతిని దార్శనిక దినంగా నిర్వహించు సంప్రదాయాన్ని ప్రవేశపెట్టేయి.ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వారు కూడా శంకర జయంతిని దార్శనిక దినోత్సవంగా పాటించుటకు చర్యలు తీసుకుంటే సముచితంగా ఉంటుంది.

”అస్తే దేశిక చరణం నిరవధి రాస్త తదీక్షణే కరుణా
ఆస్తే కిమపి తదుక్తం కిమతః పరమస్తి జన్మసాఫల్యం” (గురుచరణం ఉన్నది. వారి కటాక్షంలో నిరవధిక ప్రేమ ఉన్నది. ఆయన ఉపదేశం ఉన్నది. దీనిని మించి జన్మసాఫల్యం ఏమి కలదు).

– ప్రసాదవర్మ కాముబుషి