శృంగి మహర్షిశాపం

Maharshi
Maharshi

శృంగి మహర్షిశాపం

అభిమన్యునికి విరాటు మహారాజు కుమార్తె ఉత్తరకు జన్మించిన వాడే పరీక్షిత్తు.పరీక్షిత్తుని ముత్తాత పాండు రాజుకు వలె పరీక్షిత్తుకు కూడ వేట అంటే ఆసక్తి ఎక్కువ. ఒకరోజు అడవిలో వేటాడుతుండగా తన చేతిలో దెబ్బతిని పారిపోయిన లేడిని వెంటాడుతూ చాలాదూరం పరిగెత్తా డు. అలా పరిగెత్తుతూ ఒంటరివాడై చాలా దప్పికతో బాధపడుతూ శమీ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడా మహర్షితపస్సులో ఉన్నాడు.ఆయనతో పరీక్షిత్తుమహారాజు ఓ ముని శ్రేష్ఠుడా! నేను వేటాడిన లేడి ఇటుగా పరిగెత్తు కుంటూ వచ్చిందా? మీరేమైనా చూశారా? అని అడిగాడు.

తపస్సమాధిలో ఉన్న మునికామాటలు వినిపించలేదు. అతడి మౌనానికి కోపించిన పరీక్షిత్తు అక్కడే చచ్చిపడిఉన్న పామును తీసి ఆయన మెడలో వేసి తన దారిన తాను వెళ్లిపోయాడు. చచ్చిన పాము తన తండ్రి మెడలో వేలాడడం చూసిన శృంగి కోపంతో ఊగిపోతూ చేతిలోకి నీళ్లు తీసుకుని నిర్మానుష్యమైన అడవుల్లో ఉంటూ ఇంద్రి యాల్ని నిగ్రహించి ఆవుపాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మౌనంగా తపస్సమాధిలో ఉన్న నా తండ్రి మెడలో చచ్చినపామును వేసి అవమానించిన పరీక్షిత్తు మహారాజు నేటికి ఏడురోజుల లోపుగా తక్షకుడనే సర్పరా జు విషంచేత మరిణించుగాక! అని శాపమిచ్చి తండ్రి మెడలో వేలాడుతున్న సర్పకలేబరాన్ని తీసి అవతల పారేశాడు. తపస్సునుండి బాహ్యానికి వచ్చిన శమీక మహర్షి జరిగిందంతా తెలుసుకొని చాలా విచారించాడు. కొడుకు శృంగిని పిలిచి ఓశృంగీ ! కోపమే తపస్సును చెడగొడుతుంది. కోపమే అణిమాది అష్టసిద్దుల్ని పోగొడు తుంది. కోపమే. ధర్మకార్యాలన్నీ కోపం వలన నాశనమై పోతాయి.

కావున తపస్సు చేసుకునే ముని కోపమే పరమశత్రువు కుమారా! ఓర్పులేని తపస్వీ, ధర్మం తప్పినరాజు, పగిలిపోయిన కుండలో నీరులాగా స్థిరంగా ఉండవు. అందునా పరీక్షిత్తు మహారాజు అందరి రాజుల వంటి వాడుకాదు. సర్వభూమండలాన్ని రక్షించే రాజుకు నువ్వు ఘోరమైన శాపం ఇచ్చావు. పరీక్షిత్తు నాకు చేసిన అవమానాన్నైనా సహిస్తాను గానీ నువ్వు ఇచ్చిన శాపాన్ని మాత్రం సహించలేను అన్నాడు. తండ్రి బాధలో అనాల్సిందేదో అనేశాను కావున నామాట వ్యర్థం కాదు అన్నాడు. కొడుకు మాటలు విన్న శమీకుడు జరగబోయే ప్రమాదాన్ని పరీక్షిత్తుకు తెలపమని తన శిష్యుడైన గౌరముఖుడిని పరీక్షిత్తు దగ్గరకు పంపాడు.

గౌరముఖుడు పరీక్షిత్తు మహారాజు దగ్గరకు వెళ్లి ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న నా గురువైన శమీకమహర్షి మెడలో సర్పకళేబరాన్ని వేసి పోయావు. నువ్వు చేసిన పనికి నా గురు పుత్రుడైన శృంగి కోపించి నేటి నుండి ఏడవ రోజున తక్షకుడనే భయంకర సర్పంచేత కాటు వేయడం వల్ల మరణిస్తావని శపించాడు. పుత్రుడు చేసిన ఈ తొందరపాటు చర్యకు నాగురువు ఎంతో దుఃఖించి ఈ విషయాన్ని ముందుగా నీకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పమన్నారు అనిచెప్పి వెళ్లిపోయా డు.పరీక్షిత్తు తాను చేసిన ధర్మవిరుద్దమైన కార్యానికి దుఃఖించి శమీకుని ఓర్పును కీర్తించి వెంటనే మంత్రులం దర్నీ పిలిచి తన్ను రక్షించుకునేందుకు ఒంటిస్తంభం మేడ నిర్మించుకుని అందులో నివసించాడు.

అంతేకాకుండా విషాన్ని తొలగించే మంత్రగాళ్లను సమర్థులైన వైద్యుల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. తక్షకుడు, పరీక్షిత్తుని కాటు వేయ్యాల్సిన రోజు వచ్చింది. తన సర్పకుమారులందరినీ పిలిచి మీరంతా బ్రాహ్మణ వేశాలు ధరించండి. బుట్టల నిండా పూలు, పండ్లు తీసుకుని పోయిపరీక్షిత్తుకు బహు కరించండి. నేను మీతో పాటు అదృశ్యరూపంలో వస్తాను అని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణరూపంలో ఉన్న నాగ కుమారులంతా మంచి సువాసనలు వెదజల్లే పూలను పండ్లను పరీక్షిత్తు మహారాజుకు బహుకరించారు.

పరీక్షిత్తుకు బుగ్వేదమన్నా, యజుర్వేదంలోని క్రమ పాఠాలన్నా ఎక్కువ ప్రీతి నాగకుమారులంతా ఆయావేదా ల్ని పఠిస్తూ ఉంటే ప్రేమతో వాళ్లిచ్చే పూలను పండ్లను స్వీకరించి మంత్రులలో మంత్రి పుంగవుల్లారా! శృంగి మహర్షి నేటికి ఏడవరోజు మరణిస్తానన్నాడు. కాని కొద్ది క్షణాల్లో సూర్యుడు కనుమరుగవుతున్నాడు. ఈ సంతోష సమయంలో మీరు తలో పండు తీసుకోండి అంటూ తానొక పండు తీసుకున్నాడు. వారు తెచ్చిన పండ్లలో ఒక దానిని చీల్చి చూడగా అందులో నల్లటి పురుగు కనిపిం చింది. చూస్తూ ఉండగానే పారాణీవంటి ఎర్రని రంగుకు మారి పామై విషాగ్నులు కక్కుతూ పరీక్షిత్తును కాటేసి జరాజరా పాక్కుంటూ పోయింది. తక్షకుడి విషాగ్ని చేత పరీక్షిత్తుతో సహా ఒంటిస్తంభం మేడకాలి బూడిదైపోయిం ది. ఆ విధంగా శృంగి మహర్షిశాపం వల్ల పరీక్షిత్తు మహారాజు మరణించాడు.

– మచ్చా సులోచన