శాంతి-సమరం

Sundara Chaitanyananda
Sundara Chaitanyananda

శాంతి-సమరం

శాంతి. శాంతి. శాంతి. ఎక్కడ చూచినా ప్రపంచంలో ఇదే ఆక్రందన. ఇదే ఆకలి. యుద్ధాలు ఉన్నప్పుడే శాంతిని అన్వేషిస్తాం. ఆశిస్తాం. నేడు అందరూ శాంతినే అర్థిస్తున్నారు. కనుక అన్నిచోట్ల యుద్ధమే ఉందని అంగీకరించాలి. అక్కడా ఉంది. ఇక్కడా ఉంది. అవే అ.ఇ..లు. అ,ఇ-లు అంటే అక్కడ ఇక్కడ అని. అంటే, అమెరికా, ఇరాక్‌లని నా ఉద్దేశ్యం కాదు. అమెరికా ఇరాక్‌ల మధ్య అయితే ఆ యుద్ధం కూడా పరిమితమే. కాని, అంతఃకరణము ఇంద్రియాల మధ్య సాగే యుద్ధము కనుక, ఇది సర్వత్ర ఉంది.

సర్వత్ర యుద్ధం ఉంది కనుక సర్వత్ర శాంతి నినాదం వినపడుతోంది. మనసులో యుద్ధం లేకపోవడమే శాంతి. సంఘర్షణా సమరము అంతరించడమే శాంతి. దీనికి వేదాంతమే అవసరము లేదు. నాస్తికుడైనా శాంతి కావాలి. ఆత్మవిషయమును అలా ఉంచినా, కనీసం అంతఃకరణమైనా స్వస్థతతో ఉండాలి. శాంతితో ఉండాలి. నిత్య జీవితంలో కూడా శాంతిగల మనస్సును పొందినవాడే ఏ కార్యాన్నైనా చక్కగా, అందంగా చేయగలడు. ఫలితాలను సాధించగలడు. మన మహర్షులు ఉపనిషత్తును అధ్యయనం చేయడానికి ప్రారం భములో ”శాంతి అని పలికేవారు. ముగింపు కూడా ”శాంతితనే చేసేవారు. ఏ పని మొదలుపెట్టినా మనసును శాంతిగా ఉంచుకొని ఆరంభించాలని దాని అర్థం. శాంతితో ప్రారంభమైన కార్యాలు శాంతితోనే ముగుస్తాయి. ”నేను చెప్పే విషయం కాస్త శాంతంగా వినండి అంటూ ఉంటారు. అశాంతితో ఉండే మనసు విషయాన్ని చక్కగా అర్థం చేసుకోలేదు. అలాగే అశాంతిమయంగా ఉండే మనసు విషయాన్ని స్పష్టంగా ఎరుక పరచలేదు. చెప్పేవారి, వినేవారి మనసులు ప్రశాంతంగా ఉన్నప్పుడే చెప్పేవారు ఏమి చెప్పాలనుకున్నారో అది వినిన వారికి వంటపడుతుంది. అశాంతి ఉంటే ఉండనివ్వండి. తప్పులేదు. అశాంతిని గుర్తించాలి. కాని, అశాంతికి గురికాకూడదు. మన మహర్షులు అశాంతి తెలియని వారు కారు. అశాంతి వారిని సమీపించే ఉండింది. అయితే, వారు దానిని దాటిపోయారు. తమసోమా జ్యోతిర్గమయ అని శాంతి పలుకును వినిపించింది మహర్షులే. తమస్సును వారు చూశారు. గుర్తించారు. కాని, వారి గురి అంతా జ్యోతిమీదనే ఉండింది. అందువలన తమస్సుకు గురికాకుండా దూరమయ్యారు. జ్యోతికి చేరువయ్యారు.

చెప్పేటప్పుడు, వినేటప్పుడు, విచారించేటప్పుడు సర్వవేళల యందు మనస్సును శాంతిగా ఉండేలా చూసుకోవాలి. ఉద్వేగం లేకుండా మాట్లాడితే వినే వ్యక్తి ఉద్రేకానికి గురికాడు. ఉద్వేగం లేకుండా వినగలిగితే చెప్పేవాడిలో ఉద్రేకాగ్నిశిఖలు లేచినా, వినేవాడి శాంతి జలపాతంలో పడి చల్లబడిపోతాయి. ఇలా భక్తుడు ఉభయ తారకంగా ఉంటాడు. యస్మాన్నోద్విజతే లోకోలోకాన్నోద్విజతే చ యః ”ఎవని వలన లోకమునకు ఉద్వేగముండదో, లోకము వలన ఎవడు ఉద్వేగము చెందడో వాడే భక్తుడు అని భగవద్గీత. లోకాన్ని చూచి బందిపోటు భయపడడు.

అంతమాత్రాన బందిపోటు భక్తుడవ్ఞతాడా? లోకానికి మనిషి భయపడకపోవడమే కాదు, మనిషిని చూసి లోకం కూడా భయపడకుండా ఉండాలి. ఈ భయోద్వేగాలు ఎక్కడ తలెత్తినా ఎవరిలో తలెత్తినా అక్కడ శాంతి మిగలదు. సంఘర్షణే ఉంటుంది. సమరమే ఉంటుంది. అనుద్వేగకరం వాక్యం నీవ్ఞ మాట్లాడే మాట సత్యంగా ఉండొచ్చు. ప్రియంగా ఉండవచ్చు. హితంగా కూడా ఉండవచ్చు. కాని అది వినే వ్యక్తిలో ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించకూడదు. ఇలా కలిగించకుండా ఉండాలంటే చెప్పే వాడిలో ఉద్రేకము ఉండకూడదు. అంటే, శాంతి ఉండాలి. శాంతి ఉండాలి అంటే ఆంతర్యంలో సంఘర్షణలు ఉండకూడదు. సంఘ ర్షణలకు దారితీసే ఆలోచనల నుండి, కార్యాల నుండి వ్యక్తి విడిపడి ఉండాలి. అప్పుడే ఆంతర్యంలో శాంతిదీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపకాంతి చేరువైన వారిపై పడుతూ ఉంటుంది.

ఉద్వేగం లేకుండా మాట్లాడటం ఎలా శాంతికి సోపానమో వినేటప్పుడు ఉద్రేకం లేకుండా వినడం కూడా అంతే. కొందరి మాటలు వినాలంటే మరికొందరికి విసుగు. కొందరి ఆలోచనా సరళి మరి కొందరికి అసలే గిట్టదు. ఇలా నచ్చని, గిట్టని విషయాలు ఎదురైనప్పుడు వ్యక్తుల్లో నరాల ఉద్రిక్తత, చర్మపు ముడతలు, ముఖంలో ముడతలు, ప్రక్కచూపులు, రోగంలేని మూలుగులు వ్యక్తమవ్ఞతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచనలు, పోకడలు మనకు నచ్చకపోవడం కాదు. మన ఊహలు, మన పోకడలు వారికి నచ్చవ్ఞ అనే మనలోని అనుమానం. మనల్ని గూర్చి ఇతరులు ఆలోచించేది కాదు మనకు సమస్య. మనల్ని గూర్చి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో అని మనం చేసే ఆలోచనే మనకు సంఘర్షణ. ఒకరి ఊహలకు మరొకరి వద్ద సాక్ష్యాధారాలు లేవ్ఞ. మనం ఏది ఆలోచించినా అది నిజాల గుడికాకుండా అబద్ధాల అంగడిగా, అపోహల గారడిగా మిగిలిపోతూ ఉంది. కనుక మనం సంఘర్షణకు గురియై, అశాంతితో అలమటించడానికి ఇతరులు కారణం కారు. నిన్ను కలతపెట్టే అవకాశాన్ని నీవ్ఞ ఇతరులకు ఇచ్చినప్పుడే ఇతరులు నీ అశాంతికి కారణమవ్ఞతూ ఉంటారు. నీ ఊహలపై నీకు అధికారమున్నంతవరకు, నీ ఆశల్ని అదుపు చేసుకొనే చాకచక్యం నీకున్నంతవరకు, నీ ఇంద్రియ వ్యాపారాలలో పొదుపు జరుగుచున్నంత వరకు, కల్పిత భావాలకు, అసత్యజీవనానికి నీవ్ఞ చెల్లుచీటి సమర్పించనంత వరకు, ప్రతిఫలితాన్ని ప్రసాదంగా స్వీక రించే ఓర్పు ప్రతిపని వెనుక పరమాత్మ పనితనమును వీక్షించే నేర్పు ఉన్నంతవరకు అశాంతి నిన్ను సమీపించదు. శాంతి నిన్ను విడిచి వెళ్లదు.

– స్వామి సుందరచైతన్యానంద