శాంతియుత పోరాటం

AP CM BABU
మంగళవారం అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

శాంతియుత పోరాటం

అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం
పోరాటానికి సిద్ధమన్న సంఘాలు
ఏప్రిల్‌ 2న ఢిల్లీకి వెళ్లనున్న సిఎం
తెదేపాతో కలిసి పోరాడమన్న సిపిఎం

అమరావతిఫ µ :రాష్ట్రప్రజలను చైతన్య వంతులను చేసి ప్రత్యేకహోదా పోరాటానికి సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన వివిధ రాజ కీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్‌, ఎన్నారై, ఉద్యోగ, ఉపా ధ్యాయ, కార్మిక, వాణిజ్య సంఘాలతో జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

సచివాలయంలో మొదటి బ్లాక్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పునర్వవ్యస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఏకగ్రీవంగా అభిప్రాయ పడింది. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడటాన్ని, స్పీకర్‌ అనుమతించక పోవడం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. విభజన చట్టంలోని అంశాలను, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా రాష్ట్రానికి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను తక్షణమే ప్రకటించాలని అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల హక్కులు, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి, అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఒకేతాటి మీదకు వచ్చి రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడాల్సిందిగా అఖిలపక్షం పిలుపునిస్తూ తీర్మానించింది. బుధవారం నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేయాలని సమావేశం పిలుపునిచ్చింది.