శంషాబాద్‌ విమానాశ్రయంలో పెరిగిన నిఘా

rajiv gandhi international airport
rajiv gandhi international airport

హైద‌రాబాద్ః శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), నిఘావర్గాల ఆదేశాల మేరకు సందర్శకుల ప్రవేశ పాసులపై ఆంక్షలు విధించారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశీయ ప్రయాణికులు 2 గంటలు, అంతర్జాతీయ ప్రయాణికులు 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకొని తనిఖీలు, ఇతర భద్రతాపరమైన అంశాల్లో సహకరించాలని భద్రతావర్గాలు సూచించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంతోపాటు పరిసరాల్లో నిఘా, భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్, హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు విమానాశ్రయ ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణికులు, వాహనాల తనిఖీలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భద్రతాచర్యలపై అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్ వర్గాలు తెలిపాయి.