వ‌ర‌ల్డ్ హాకీ టైటిల్‌పై భార‌త్ చూపు

Indian Hockey Team
Indian Hockey Team

భువ‌నేశ్వ‌ర్ః ఆసియా హాకీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌.. అంతర్జాతీయ స్థాయిలో పునర్‌వైభవం సొంతం చేసుకోవాలనే కసితో ఉంది. ఇందుకోసం శుక్రవారం ఆరంభయ్యే వరల్డ్‌ హాకీ లీగ్‌ మూడో, చివరి అంచెలో టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. పూల్‌-బిలో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌.. వరల్డ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొననుంది. పదేళ్ల తర్వాత ఆసియా కప్‌ నెగ్గి జోరుమీదున్న భారత్‌.. ఆసీస్‌కు షాకిచ్చి టోర్నీలో శుభారంభం చేయాలను కుంటోంది. అయితే ప్రపంచ నెం:2 టీమ్‌ను నిలువరించడం అంత సులువు కాదు. ముఖ్యంగా కొత్త కోచ్‌ జోర్డ్‌ మారిన్‌కు ఈ టోర్నీ విషమ పరీక్ష. భారత సెలెక్టర్లు అంతర్జాతీయ టోర్నీల్లో ఫలితాలు ఆశిస్తున్న తరుణంలో బాధ్యతలు అందుకున్న తర్వాత మారిన్‌ జట్టు వ్యూహాలు, ఆటలో భారీ మార్పులు చేయలేదు. తమకు నచ్చిన రీతిలో ఆడాలని ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. మారిన్‌ పనితీరు ఆసియా కప్‌లో ఫలితాలు అందించింది. టీమిండియా పదేళ్ల తర్వాత ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌, వరల్డ్‌ కప్‌ ఇలా మెగా ఈవెంట్‌లు వరుసబెట్టి ఉండడంతో జట్టు బలాబలాలను అంచనా వేసేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని కోచ్‌ భావిస్తున్నాడు. 2015లో కాంస్యం సాధించిన భారత్‌.. ఈసారి అంతకంటే మెరుగైన ఫలితాన్ని ఆశిస్తోంది. మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో యువకులు, అనుభజ్ఞుల కలబోతతో టీమిండియా సమతూకంతో కనిపిస్తోంది. మరోవైపు కొత్త కోచ్‌ కోలి న్‌ బాచ్‌ నేతృత్వంలో ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. ఆరంభం నుంచే దూకుడైన ఆటను ప్రదర్శించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఆసీస్‌ శైలి. మరి ఇలాంటి టీమ్‌కు భారత్‌ ఏవిధంగా చెక్‌ పెడుతుందో చూడాలి. పూల్‌-బిలో భారత్‌, ఆస్ట్రేలియాతోపాటు ఇంగ్లండ్‌, జర్మనీ ఉండగా.. పూల్‌-ఎలో అర్జెంటీనా, బెల్జియం, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ జట్లు ఉన్నాయి. తొలి రోజు మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జర్మనీ తలపడనుంది.